
- వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్
- ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించినా సమర్పించని ఏపీ
- 11 తెలంగాణ ప్రాజెక్టుల్లో 5 ప్రాజెక్టులకే టీఏసీ అనుమతులు
- 2 రాష్ట్రాల్లోని 16 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటున్న జీఆర్ఎంబీ
- బోర్డు మీటింగ్ ఎజెండాలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్‌పై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జనవరి 24న బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. జనవరి 4న ఈఎన్సీ జనరల్ కూడా బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆ లేఖల ఆధారంగా.. ప్రాజెక్టుపై వివరాలు సమర్పించాలని జనవరి 9న బోర్డు ఆదేశించినా.. ఏపీ స్పందించలేదు. దీంతో ఆ అంశంపై బోర్డులో చర్చించాలని నిర్ణయించారు. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని జీఆర్ఎంబీ నిర్ణయించింది. 2 రాష్ట్రాలకు సమావేశంపై సమాచారమిచ్చింది. దానితోపాటు మీటింగ్‌లో చర్చించే అంశాల ఎజెండానూ రాష్ట్రాలకు పంపించింది. ఆ మీటింగ్‌లోనే జీబీ లింక్‌పై బోర్డు చర్చించనున్నది.
తెలంగాణ ప్రాజెక్టుల్లో కొన్నింటికే ఆమోదం
తెలంగాణ, ఏపీకి చెందిన 15 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై బోర్డు మీటింగ్‌లో చర్చించనున్నారు. అందులో 4 ఏపీవి ఉండగా.. మిగతా 11 ప్రాజెక్టులు తెలంగాణవే. మన రాష్ట్రం చేపట్టిన 11 ప్రాజెక్టులకు అనుమతులు లభించలేదని ఎజెండా అంశాల్లో బోర్డు పేర్కొంది. 9 ప్రాజెక్టులకు సంబంధించి 8 డీపీఆర్‌లకు సీడబ్ల్యూసీ అప్రైజల్ కమిటీ ఆమోదం తెలిపిందని వెల్లడించింది. అందులో 2 ప్రాజెక్టులకు కలిపి ఒకే కామన్ డీపీఆర్ ఉందని తెలిపింది. మిగతా 2 ప్రాజెక్టులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరిందని, దీంతో చనాకా –కొరాట బ్యారేజీ డీపీఆర్‌కూ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
ఆమోదం పొందిన 9 డీపీఆర్‌లపై సమగ్ర అధ్యయనం చేశాక సీడబ్ల్యూసీకి పంపించామని, అందులో 6 ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ కొన్ని సూచనలు చేసినట్టు వివరించింది. మళ్లీ వాటిపై రివ్యూ చేసి సీడబ్ల్యూసీకి పంపించాక.. 5 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని బోర్డు ఎజెండాలో పేర్కొంది. ఏపీకి సంబంధించిన ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఆమోదం తెలుపలేదని వెల్లడించింది. పెద్దవాగు ఆధునికీకరణపైనా మీటింగ్‌లో చర్చించనున్నారు. కేంద్రం 2021 జులై 15న ఇచ్చిన గెజిట్నోటిఫికేషన్కు తగ్గట్టుగా 2 రాష్ట్రాల పరిధిలోని 16 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాల్సిందిగా జీఆర్ఎంబీ చెబుతున్నది. కాగా, జీఆర్ఎంబీలో ప్రాజెక్టులను మానిటరింగ్ చేసేందుకు జీఐఎస్ హైడ్రాలజీ సెల్‌ను ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తున్నది. వాటితోపాటు బోర్డు బడ్జెట్, కొత్త పోస్టుల క్రియేషన్‌పై చర్చించనున్నారు.