
- 5.75 లక్షల టన్నులకు పైగా వడ్ల కొనుగోళ్లు
- ఇందులో 4 లక్షల టన్నుల వరకు సన్న వడ్లే
- రూ.290 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ
- ఇప్పటి వరకు కొనుగోళ్లలో నిజామాబాద్ టాప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్లకు వడ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి రాష్ట్రంలో యాసంగి కోతలతో పాటు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,200కు పైగా సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లయ్స్శాఖ నిర్ణయించగా, ఇప్పటికే 7,200కి పైగా సెంటర్లు ఓపెన్ చేశారు. దీంతో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమైంది. యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా అన్ని జిల్లాల్లో సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ చేపడుతున్నారు.
సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వరి సాగు తక్కువగా ఉన్న జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో సెంటర్లు ప్రారంభించి కొనుగోళ్లు చేపడుతున్నరు. ఈ సారి ఇరవై ఐదు రోజుల ముందుగానే సెంటర్లు ప్రారంభించారు.
ఇటీవల రాష్ట్రంలో వరుసగా అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సివిల్ సప్లయ్స్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరో వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరగనున్నాయి. సెంటర్లకు వచ్చిన ధాన్యం కాంటా పెట్టి వెంట వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్లో 3.80లక్షల టన్నుల సేకరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన కొనుగోలు సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 5.75లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అయితే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 3.80లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తరువాత నల్గొండ జిల్లాలో 1.25 లక్షల టన్నుల వడ్లు సేకరించారు. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో 60వేల టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.290కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
60 శాతం సాగు సన్నాలే
యాసంగిలో రికార్డు స్థాయిలో 56.69లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సన్న ధాన్యానికి సర్కారు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో వరిలో సన్న రకాల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ యాసంగి వరి ధాన్యం దిగుబడి 1.30 కోట్ల టన్నులు వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలున్నాయి. అయితే ఇందులో 60 శాతానికి పైగా సన్న రకాలే సాగు చేశారు. ఈ నేపథ్యంలో కొనుగోలు సెంటర్లకు సన్నవడ్లే ఎక్కువగా వస్తున్నాయి.
సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల టన్నుల సన్నవడ్లు సేకరించింది. రాష్ట్రంలో సన్నబియ్యాన్ని సర్కారు రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న నేపథ్యంలో మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించి సన్నవడ్లు సేకరిస్తున్నది. ఈ నేపథ్యంలో మార్కెట్కు వస్తున్న ధాన్యంలో ఎక్కువ శాతం సన్నవడ్లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.