- ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి తనిఖీలు
- గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.241 కోట్లు పట్టివేత
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. గత మూడు వారాల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో రూ. 31.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. మార్చి16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శనివారం నాటి వరకు రూ. 3.21 కోట్ల విలువైన మద్యాన్ని, రూ. 7.67 కోట్ల విలువైన గోల్డ్, సిల్వర్, డైమండ్స్ ను, రూ. 1.62 కోట్ల విలువైన గిఫ్ట్ లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 466 ఫ్లయింగ్ స్క్వాడ్స్, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 85 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, బంగారం, వెండి వస్తువుల విలువ మొత్తం రూ.49 కోట్లు ఉంటుందన్నారు. మొత్తం 6,647 లైసెన్స్ డ్ ఆయుధాలు జప్తు చేసుకోగా, మరో 8 లైసెన్స్ లేని ఆయుధాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.241.38 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటనలో వివరించారు.