తెలంగాణ దేశానికే రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌ :మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ దేశానికే రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌ :మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : దేశానికే మార్గదర్శకంగా ఉండేలా తెలంగాణలో కులగణన చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 1931లో ఆంగ్లేయుల కాలంలో కులాల సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఆ పని చేసిందన్నారు. లక్ష మంది ఉద్యోగులతో 1.12 కోట్ల ఇండ్లు తిరిగి సర్వే చేపట్టామన్నారు. ఈ సర్వేపై అసెంబ్లీలో చర్చ పెడితే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

పదేండ్లు అధికారంలో ఉండి కూడా బీసీలకు న్యాయం చేయని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్‌‌‌‌ ఫ్యామిలీకే పరిమితమైందని విమర్శించారు. ఇప్పటివరకు కుల సర్వేనే జరగలేదని అలాంటప్పుడు తప్పుడు లెక్కలు చూపుతున్నారనడంలో అర్థం లేదన్నారు. బీసీల లెక్క 56 శాతంగా తేలిందని, బలహీన వర్గాల కోసం ఓ రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ తయారైందన్నారు.

పార్టీలో తాను కూడా ఇస్సాదార్‌‌‌‌నే అన్న బీసీ నాయకుడైన ఈటల రాజేందర్‌‌‌‌ను బయటకు పంపించారని ఎద్దేవా చేశారు. బీజేపీ దేశంలో మతం పేరుతో విధ్వంసాలు సృష్టించి ఓట్లు దండుకుంటుందని మండిపడ్డారు. లైబ్రరీ చైర్మన్‌‌‌‌ లింగమూర్తి, సింగిల్‌‌‌‌ విండో చైర్మన్‌‌‌‌ శివయ్య పాల్గొన్నారు.