
- అసెంబ్లీ, మండలిలోనూ అన్ని పార్టీల మద్ధతు కూడగట్టడంలో విజయవంతం
- హైకమాండ్ నుంచి సీఎం రేవంత్అండ్ టీంకు అభినందనలు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. కులగణన సర్వే చేసి.. ఎక్కడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రెండు బిల్లులను ఆమోదించుకోవడంలో సక్సెస్ అయింది. అదే సమయంలో అసెంబ్లీ, మండలిలోనూ అన్ని రాజకీయ పక్షాల మద్దతును పొందడంలోనూ అధికార పార్టీ సక్సెస్ అయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టసభల్లో ఆమోదం తీసుకోవడంపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి అప్రిషియేషన్స్తెలియజేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కుల గణన చేపడతామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, నియామకాలు, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ, శాసన సమండలి బిల్లులను ఆమోదించాయి. దేశంలో ఒక్క తమిళనాడు మినహా మరెక్కడా బీసీలకు సరైన రిజర్వేషన్లు లేవు.. ఇప్పుడు తెలంగాణలో అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరోవైపు.. ఎస్సీల్లోనూ తాము నిర్లక్ష్యానికి గురయ్యామని, తమ కులాల వర్గీకరణ చేపట్టాలని ఉద్యమాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఏకసభ్య కమిషన్ నియమించడంతో పాటు వర్గీకరణ కేసు రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వచ్చినప్పుడు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎస్సీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి న్యాయపరమైన చిక్కులు తొలగించడంలో ఎంతగానో కృషి చేశారు.
చాకచక్యంగా వ్యవహరించిన రేవంత్
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంలో సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. భిన్న ధ్రువాలుగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకతాటిపై నిలిపారు. శాసనసభ, మండలిలో గంటలకొద్ది చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ సూచనలు, సలహాలను ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. గత పదేళ్లలో ఇంత లోతైన చర్చ మరే బిల్లులపైనా సాగలేదు. అన్ని పక్షాలను ఏకం చేయడంతో ఈ బిల్లుల ఆమోదానికి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.