
- యాసంగి వడ్ల కొనుగోళ్లకు సివిల్ సప్లైశాఖ ఏర్పాట్లు
- రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 8,200 కొనుగోలు సెంటర్లు
- కోతలు మొదలైన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదట ఏర్పాటు
- ఈ సారి యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు
- 1.30 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి వరి కోతలు ప్రారంభం కాగా, ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లై శాఖ వెంటవెంటనే ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి యాసంగిలో 1.30 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 8,200 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే కోతలు మొదలైన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదట సెంటర్లు ఏర్పాటు చేసి, క్రమంగా విస్తరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈ సారి యాసంగిలో 56.69 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి సాగైంది. గతేడాది కంటే దాదాపు 5.50లక్షల ఎకరాల్లో సాగు పెరిగినట్లు వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తున్నది. యాసంగిలో ఎకరానికి యావరేజీగా 23 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం 1.30కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. సాగైన వరిలో 60శాతం సన్న రకాలే ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో దాదాపు 80 లక్షల నుంచి 90లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ శాఖ అంచనా వేస్తున్నది. రాష్ట్రంలో సన్నబియ్యాన్ని సర్కారు రేషన్ లబ్ధిదారులకు అందించనున్న నేపథ్యంలో యాసంగిలో మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించి సేకరించే సన్నధాన్యాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించేందుకు వినియోగించనున్నారు. దొడ్డు ధాన్యాన్ని ఎఫ్సీఐకి అందించే అవకాశాలు ఉన్నాయి.
కోతలు మొదలైన దగ్గర సెంటర్లు
రాష్ట్రంలో వరి కోతలు షురూ అయ్యాయి. ముందస్తుగా సాగు చేసిన నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లో వరి కోతలు ఇప్పటికే షురూ అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు కోతలవుతున్న నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్ని కొనుగోలు సెంటర్లు షురూ కాగా మరి కొన్ని ప్రాంతాల్లో అధికారులు కొనుగోళ్ల కోసం సన్నాహాలు చేస్తున్నారు.
వరిసాగులో నల్గొండ టాప్..
అత్యధికంగా నల్లొండ జిల్లాలో 5.40లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఆ తరువాత సూర్యాపేట జిల్లాలో 4.73లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతంలో వరిసాగులో టాప్లో ఉండే నిజామాబాద్ 4.19లక్షల ఎకరాలతో మూడో స్థానంలో ఉంది. సిద్దిపేట జిల్లా 3.50 లక్షల ఎకరాలతో నాలుగో ప్లేస్లో ఉండగా, 2.75లక్షల ఎకరాలతో యాదాద్రి జిల్లా ఐదో స్థానంలో ఉంది.
మెదక్ జిల్లా 2.58లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లా 2.27లక్షల ఎకరాలతో తరువాత స్థానాల్లో నిలిచాయి. అయితే నల్గొండ, సూర్యపేట, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి.