బేస్​ క్యాంప్​ తరహా ఫారెస్టు.. స్టేషన్లు కూనవరం, గొందిగూడెంలో ఏర్పాటు

  • అటవీ ఠాణాల ప్రతిపాదనలు బుట్టదాఖలు 
  • ఇటీవల బేస్​ క్యాంపు తరహాలో ఫారెస్ట్ స్టేషన్లను పెట్టాలని ప్లాన్​ 
  • ప్రయోగాత్మకంగా మణుగూరు డివిజన్​లో ఫారెస్ట్ స్టేషన్​ ఏర్పాటు

భద్రాచలం, వెలుగు :  అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో అటవీ ఠాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు మరుగునపడ్డాయి. గత బీఆర్​ఎస్​ సర్కారు హయాంలో 2022 నవంబర్​ 22న చండ్రుగొండ మండలంలో పోడు భూముదారుల దాడిలో ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​ చనిపోయిన ఘటనలో అప్పటి ప్రభుత్వం అటవీ ఠాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరింది.  జిల్లాలో పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యం, అశ్వాపురం రేంజ్​, చర్ల, మణుగూరు రేంజ్​ల్లో ఈ ఠాణాలు పెట్టాలని అటవీశాఖ ప్రతిపాదించింది. 

కానీ ఆ ప్రతిపాదనలు అప్పుడే బుట్టదాఖలయ్యాయి. అడవులు ఎక్కువగా ఉన్న కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్​ రాష్ట్రాల్లో ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్లను అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఆయుధాలతో పాటు, వాహనాలు, వాకీటాకీలు, వైర్​లెస్​ సెట్లు వినియోగిస్తున్నారు. 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ ఇదే తరహా అటవీ ఠాణాలు ఉండేవి. 

పీపుల్స్ వార్​ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఆయుధాలను సమీప స్టేషన్లలో సరెండర్​ చేశారు. దీంతో అప్పటి నుంచి ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ వెపన్స్ లేకుండానే విధులు నిర్వర్తిస్తోంది. కానీ ఇటీవల పోడు సాగుదారులు, స్మగ్లర్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అటవీఠాణాల ఏర్పాటు చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ప్రయోగాత్మకంగా ఫారెస్ట్ స్టేషన్లు

అటవీ ఠాణాల ఏర్పాటు మరుగున పడటంతో అటవీసంరక్షణకు డిపార్ట్​మెంట్​ శ్రీకారం చుట్టింది. మణుగూరు ఫారెస్ట్ డివిజన్​లో కూనవరం, గొందిగూడెంలలో ప్రయోగాత్మకంగా ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే మణుగూరు మండలం కూనవరంలో ఒకటి నెలకొల్పారు. అశ్వాపురం మండలం గొందిగూడెంలో స్థల పరిశీలన జరుగుతోంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న సెక్షన్లలో బేస్​ క్యాంపు తరహాలో ఫారెస్ట్ స్టేషన్లను పెట్టాలని నిర్ణయించారు.  జిల్లాలో 10,13,460 హెక్టార్ల అడవులు విస్తరించి ఉన్నాయి.

 అడవుల ఆక్రమణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ ఉత్పత్తులకు రక్షణగా ఫారెస్ట్ స్టేషన్లు పనిచేస్తాయి. వేసవికాలంలో అడవుల్లో చెలరేగే అగ్ని కీలలను నియంత్రించేందుకు కూడా ఫైర్​ బ్లోయర్స్ లాంటి సామగ్రి ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలుగు లాంటి వన్యప్రాణుల అక్రమ రవాణా జిల్లాలో వెలుగు చూసింది. అడవి జంతువుల వేట కూడా కొనసాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు ఈ ఫారెస్ట్ స్టేషన్లు దోహదపడతాయని ఆఫీసర్లు 
భావిస్తున్నారు.

ప్రతిపాదనలు పంపినం.. మంజూరు కాలే.. 

అటవీ ఠాణాల ఏర్పాటు కోసం గతంలోనే ప్రతిపాదనలు పంపినం. అవి ఇంకా మంజూరు కాలేదు. దీంతో బేస్​ క్యాంపు తరహాలో కూనవరం(మణుగూరు), గొందిగూడెం(అశ్వాపురం)లలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నం. జిల్లాలో అడవుల సంరక్షణే ధ్యేయంగా సిబ్బంది పనిచేస్తున్నారు. -  కృష్ణగౌడ్, డీఎఫ్​వో, భద్రాద్రికొత్తగూడెం