తెలంగాణ రణభేరి అనభేరి ప్రభాకర్ రావు

తెలంగాణ రణభేరి అనభేరి ప్రభాకర్ రావు

దొర కొడుకు చిన్న దొర కావాలి. కానీ, ఆయన ప్రజల మనియ్యాడు. బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని ఎదిరించి కొట్లాడాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించిన వీరుడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో 1910 అగష్టు 15వ తేదీన అనభేరి ప్రభాకర్ రావు జన్మించాడు. అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధాబాయి రెండో సంతానం ఆయన. వెంకటేశ్వర్ రావు 400 ఎకరాల భూస్వామి. నిజాం తొత్తులైన దొరల్లాగే ఆయన ప్రజల్ని దోచుకునేవాడు. ఆ కుటుంబంలో పుట్టిన ప్రభాకర్ రావు మాత్రం చిన్నప్పటి నుంచే పేదల పక్షాన ఆలోచించేవాడు. అన్న రమణారావుతో కలిసి కరీంనగర్ లో ప్రాథమిక విద్యనభ్యసించిన తర్వాత మచిలీపట్నంలో కొన్ని రోజులు చదువుకున్నాడు. రెడ్డి హాస్టల్ లో ఉంటూ చాదర్ ఘాట్ హైస్కూల్లో టెన్త్ పూర్తి చేశాడు. విద్యార్థిగా ఉండగానే నిజాం వ్యతిరేక ఉద్యమంలోకి అడుగుపెట్టిన అనభేరి ప్రభాకర్ రావు.. ఊర్లో సొంత కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలనే వ్యతిరేకించాడు. పాలేర్ల పిల్లలను బడిలో చేర్పించాడు. గ్రామంలో సహకార సంఘాలను ఏర్పాటు చేయించి రైతు మహాసభలు నిర్వహించాడు. కరీంనగర్ లో చేనేత పారిశ్రామిక సంఘాన్ని స్థాపించి 30వేల మందికి రేషన్ కార్డులు ఇప్పించాడు. 1942 నుంచి 1946 వరకు ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశాడు. ఆంధ్ర మహాసభ పేరుతో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి రైతులను చైతన్యపరచడం చూసి వారితో కలిసి సమావేశాలకు పోయేవాడు. 

తెలంగాణ భగత్ సింగ్ గా పేరు

హైదరాబాద్ లో జరిగిన 4వ ఆంధ్ర మహాసభ ప్లీనరీలో అనభేరి ప్రభాకర్ రావు కీలకపాత్ర పోషించాడు. బద్దం ఎల్లారెడ్డి పిలుపుతో 1947 సెప్టెంబరులో వందలాది మంది యువకులు సాయుధ పోరాటంలోకి వెళ్లారు. అనభేరి ప్రభాకర్ రావు నాయకుడిగా ఉన్న దళం కరీంనగర్ జిల్లాలోని 40 గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దాడులు చేసింది. 1948లో పేద రైతులకు సంబంధించిన అప్పులు, ఇతర పన్నులకు సంబంధించిన రికార్డులన్నీ తగులబెట్టి వారిని విముక్తి చేసింది. సాయుధ పోరాటంలో అనభేరి ప్రభాకర్ రావు పోరాటంతో జనం ఆయన్ను తెలంగాణ భగత్ సింగ్ గా పిలిచేవారు. అటు భూస్వాములు, ఇటు రజాకార్లను ఎదురించిన అనభేరి.. నిజాం రాజుకు నిద్ర లేకుండా చేశాడు. దీంతో అనభేరి ప్రభాకర్ రావుకి తాలూకాదార్ పదవి ఇస్తామని నిజాం సర్కార్ ఆశపెట్టింది. అయినా లొంగలేదు. నిజాం సర్కార్ నజర్ బంద్ జారీ చేయడంతో అనభేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. రజాకార్లకు ఆయన ముఖం తెలియదు. అందుకే ఆయన ఆచూకీ చెప్పాలని జనాన్ని హింసించేవారు. కొంతమంది నేనే ప్రభాకర్ రావునని చెప్పి రజాకార్ల చేతిలో బలయ్యారు. భూపతిరెడ్డితో కలిసి ప్రభాకర్ రావు విజయవాడ, చాందా, సిర్వంచలో ఆదిలాబాద్, కరీంనగర్ దళాలకు శిక్షణ ఇచ్చాడు. మొదటి దళం ప్రభాకర్ రావు నాయకత్వంలో జైత్రయాత్ర నిర్వహించింది. అనభేరి ప్రభాకర్ దగ్గర స్టెన్ గన్ ఉండేది. మిగతా సభ్యుల దగ్గర లాఠీలు మాత్రమే ఉండేవి. మందుగుండు కోసం పోలీస్ స్టేషన్ల మీద మెరుపుదాడి చేసేవాడు.

రజాకార్లతో వీరోచితంగా పోరాడాడు

1948 మార్చ్ 14న హుస్నాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్మదాపుర్ లో అనభేరి దళం షెల్టర్ తీసుకుంది. ఆ గ్రామ పోలీస్ పటేల్ భోజనానికి పిలిచి.. ఆ విషయాన్ని నిజాం సర్కార్ కు చేరవేశాడు. అప్పటికే తీవ్రంగా గాలిస్తున్న రజాకార్లు అనభేరి ప్రభాకర్ రావు దళంపై విరుచుకుపడ్డారు. అయితే.. ఊరి జనానికి నష్టం జరగొద్దన్న ఆలోచనతో దళం మొత్తం ప్రాణాలకు తెగించి మహ్మదాపూర్ గుట్టల్లోకి పారిపోయింది. కొంతమంది తప్పించుకున్నారు. ప్రభాకర్ కూడా తప్పించుకునే అవకాశం వచ్చినా పారిపోకుండా రజాకార్లపై కాల్పులతో ఎదురుదాడి చేశాడు. చాలాసేపు ఫైరింగ్ చేసి గుట్టల్లోకి వెళ్లిపోతున్న సమయంలో భూపతిరెడ్డి గాయపడ్డాడు. ప్రభాకర్ రావు ఒక చేత్తో ఆయనకు బ్యాండేజ్ కడుతూ మరో చేత్తో ఫైరింగ్ చేశాడు. అవకాశం దొరకడంతో రజాకార్లు, పోలీసులు చుట్టుముట్టారు. హాస్పిటల్ కు తీసుకుపోతామన్నారు. వాళ్ల సాయం కంటే చావే మేలని భావించిన ప్రభాకర్ రావు పోరాటానికి సిద్ధమయ్యాడు. రజాకార్ల కాల్పుల్లో బలయ్యాడు. 

‘షేర్ మ‌ర్ గ‌యా’ అంటూ రజాకార్ల సంబరాలు

తెలంగాణ పోరాట సమయంలో మన గడ్డపై  జరిగిన తొలి పోలీస్ ఎన్ కౌంటర్ అది. అనభేరి ప్రభాకర్ రావుతో పాటు 12 మంది దళ సభ్యులు చనిపోయారు. వాళ్లందరి శవాలను గుట్టపై నుంచి ఈడ్చుకు వచ్చి అక్కడే సామూహిక దహనం చేశారు. అనభేరి కోటును కట్టెకు కట్టి ‘షేర్ మర్ గయా’ అంటూ రజాకార్లు గ్రామాల్లో తిరిగారు. అనభేరి ప్రభాకర్ రావు మరణం ఊరూరా యువతను కదిలించింది. రజాకార్లకు వ్యతిరేకంగా అన్ని గ్రామాల్లో యువ సైనిక దళాలు ఏర్పాడ్డాయి. తన అమరత్వంతో సాయుధ పోరాటాన్ని నిలబెట్టిన అనభేరి ప్రభాకర్ కి తగిన గౌరవం దక్కలేదు. ఆయన గాథకు గుర్తింపు దక్కలేదు. ట్యాంక్ బండ్ పై కాస్తా జాగా దొరకలేదు. ప్రతి ఏటా ఆయన చనిపోయిన రోజు మహ్మదాపుర్ గుట్టల్లో జాతర జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి పిల్లల పుట్టు వెంట్రుకలు తీస్తారు. అనభేరి జీవిత విశేషాలు, ఆయన పోరాటాన్ని ఇప్పటికీ పల్లెల్లో బుర్రకథలు, ఒగ్గుకథలుగా చెబుతుంటారు.