విద్యా ప్రమాణాలకు తెలంగాణ మోడల్​గా నిలవాలె

విద్యా ప్రమాణాలకు తెలంగాణ మోడల్​గా నిలవాలె

సీఎం రేవంత్​రెడ్డి  ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమే. అయితే, తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత పెద్ద సంక్షోభంలో ఉందో  లోతులకు పోతేనే తెలుస్తుంది.  ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి వీలు అవుతుంది.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం 36 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకుగాను  తెలంగాణ విద్యా సామర్థ్యాల విషయంలో 35 వ స్థానంలో ఉంది.  కేవలం మేఘాలయ మాత్రమే మనకంటే వెనుకబడి ఉంది.  అలాగే గత విద్యా సంవత్సరం SCERT నిర్వహించిన ఎఫ్. ఎల్. ఎన్ (FLN) అసెస్​మెంట్​తో పాటు,  పలు జాతీయ నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

గత సంవత్సరం  మార్చి నెలలో  సమగ్ర శిక్ష అభియాన్  నిధుల కోసం కేంద్ర పాఠశాల విద్యా మంత్రిత్వశాఖ  ప్రాజెక్ట్ అప్రూవల్  బోర్డ్  వీడియో సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి  కృషి చేయాలని హెచ్చరించింది.  ముఖ్యమంత్రి  రేవంత్​రెడ్డి  ముందుగా ఈ నివేదికలన్నిటిపై  పూర్తి సమీక్షలు నిర్వహించాలి. గత సర్కారు పది సంవత్సరాలు విద్యా వ్యవస్థపై పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడంతోపాటు అవసరమైన నిధులను కేటాయించలేదు. చట్టబద్ధమైన కేంద్ర విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకపోగా చట్టాన్ని కించపరచడం రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించకపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. 

నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం కావాలి

ప్రభుత్వం విద్యార్థులకు  సమాన విద్యా అవకాశాలను అందించాలి. పేద, ధనిక తేడా లేకుండా గ్రామీణ, పట్టణ వ్యత్యాసం లేకుండా విద్యార్థులందరికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలి. ఏదో కొన్ని మౌలిక వసతులు కల్పించడం,  టీచర్ల భర్తీ చేసినంత మాత్రాన తెలంగాణ విద్య సంక్షోభం నుంచి బయటపడదని గమనించాలి.  సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం స్వాతంత్ర్యం సిద్ధించిన 62 సంవత్సరాలకు  విద్యా హక్కు చట్టాన్ని ఈ దేశానికి అందించింది. ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు వయసు పిల్లలకు విద్యాహక్కును అందించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ హయాంలో కేంద్రం తెచ్చిన విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసే అవకాశం వచ్చింది. చట్టాన్ని అమలు చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలి.  జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని,  విద్యా సామర్థ్యాలు మెరుగుపరచడానికి ప్రతి సబ్జెక్ట్ కు,  ప్రతి తరగతికి ఒక టీచరు,  ప్రతి తరగతికి ఒక గది నిర్మిస్తామని,  ప్రతి మండలంలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉండే ఒక కమ్యూనిటీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అమలుచేసి దేశానికి ఒక మోడల్​గా నిలుస్తామని హామీ ఇవ్వాలి.

విద్యా సంక్షోభాన్ని సర్కారు గుర్తించాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అర్థం చేసుకున్నట్లు లేదు. అందుకు పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించకపోగా వాటి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటే నిదర్శనం.   జనవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసి వెంటనే ఉపసంహరించుకుంది. కారణాలు ఇప్పటికీ తెలియదు. విద్యా కమిటీలకు,  స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను తుంగలో తొక్కి  మహిళా సంఘాలకు బాధ్యతలను అప్పచెప్పి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని మహిళా సంఘాల మీద వేసి చేతులు దులుపుకోవడమే. ఇది విద్యా హక్కు చట్టం ఉల్లంఘనే.  ఇక ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వాటి నియంత్రణ గురించి ఒక పెద్ద చర్చ అవసరం.  ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితమే  ప్రైవేటు విద్య అవతరించిందని అంగీకరించాలి.  ముందుగా రాష్ట్రం ‘విద్యా సంక్షోభం’లో ఉందని గుర్తించాలి. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత అనే రాజకీయ సంకల్పం అవసరం.  రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 లక్షలమంది కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఉన్నారు. వారందరికి నాణ్యమైన విద్య గురించి ప్రణాళికలు రూపొందించాలి.

విద్యపై నిర్లక్ష్యం..ఒక తరానికి అన్యాయం

మొదటగా విద్యాపరమైన అత్యవసర పరిస్థితిపై రాష్ట్ర స్థాయిలో సమూలమైన చర్చ ప్రారంభించాలి. ఆ తరువాత పాఠశాలలకు పర్యవేక్షణ పర్యటనలు జరపాలి. ఉపాధ్యాయ సంఘాలతో, తల్లిదండ్రులతో,  విద్యార్థి వర్గాలతో సంభాషించి, వారి అనుభవాలు, సమస్యలు తెలుసుకోవాలి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. విద్యను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఒక తరానికి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం.  ఎన్నికల మేనిఫెస్టోలో  వాగ్దానం చేసినట్లుగా రాష్ట్ర బడ్జెట్​లో విద్యకు 15 శాతం నిధులను కేటాయించాలి.  విద్యా  సమస్యలు జిల్లా జిల్లాకు ప్రత్యేకం. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు అవసరాలు వేరు.  విధానాలు నిర్ణయించేటప్పుడు  వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని జిల్లాలకు, కొన్ని మండలాలకు ప్రత్యేక విద్యా ప్రణాళికలు అవసరం.  ప్రస్తుతం పెద్ద సంక్షోభంలో ఉన్న విద్యావ్యవస్థకు తక్షణ మార్పులను చేపట్టడం అత్యవసరమే అయినా మొత్తం పాఠశాల వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి.  మంత్రుల పిల్లలు,  ఎమ్మెల్యేల పిల్లలు, ఉన్నత అధికారుల పిల్లలు, శ్రామికుల పిల్లలు అందరూ కలిసి  తమ పరిసరాలలో అన్ని  వసతులతో  ఉండే బడిలో చదివినప్పుడే విద్యాహక్కు గ్యారంటీని ఇచ్చినట్లు అవుతుంది. ఈ దిశగా తెలంగాణలోని రేవంత్​ ప్రభుత్వం అడుగులు వేయాలని ఆశిద్దాం. 

విద్యా సంస్కరణలు తీసుకురావాలి

అభ్యసన ఫలితాలు సాధించాలంటే వాటికి తగిన సంస్కరణలు తీసుకురావాలి.  విద్యాశాఖలో పనిచేస్తున్న  ప్రతి అధికారిని బాధ్యునిగా చేయాలి. ముఖ్య కార్యదర్శి నుంచి జిల్లా అధికారులు, ఉపాధ్యాయుల వరకు బోధనకు జవాబుదారీగా పని చేయాలసి ఉంటుంది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలి. బోధన మీదనే  ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలి. అలాగే రిటైర్ అయిన టీచర్ల స్థానంలో వెంటనే టీచర్ల భర్తీ చేసే విధానం సత్వరం రూపొందించవలసి ఉంటుంది.  ఈ సవాళ్లను ఎదుర్కొంటూ విద్యా వ్యవస్థలో కఠిన నిర్ణయాలను సీఎం రేవంత్​ తీసుకుంటేనే భవిష్యత్తులో తెలంగాణలో బడులకు వెళ్ళిన పిల్లలకు సమాన అవకాశాలు కల్పించినట్లు అవుతుంది.  రాశి కన్నా వాసి మీద దృష్టి పెట్టడం క్లిష్టతరం మాత్రమే కాదు, ఎంతో  కాలవ్యవధితో కూడుకున్నది.  దీర్ఘకాలిక విధానపరమైన సంస్కరణలు. ప్రాధాన్యాలలో మార్పు అవసర మవుతుంది.  మొదట ఈ సమస్య ఉన్నదని. పరిస్థితిని మార్చవలసి ఉన్నదని గుర్తించాలి. 

- ఆర్.వెంకట్ రెడ్డి,
జాతీయ కన్వీనర్, 
ఎం.వి.ఫౌండేషన్