
- అగ్రిమెంట్‌పై ఇరు రాష్ట్రాల సంతకాలు
- గ్రీన్ ఎనర్జీలో ఇది గొప్ప ముందడుగని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: హిమాచల్‌ప్రదేశ్‌లో హైడల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడం ద్వారా తెలంగాణ సర్కారు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాజస్థాన్‌లో సింగరేణి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్లను నిర్మిస్తుండగా తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 520 మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నది.
బిల్డ్–ఆపరేట్– ట్రాన్స్ ఫర్(బీవోటీ) విధానంలో హిమాచల్ ప్రదేశ్ లో రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా శనివారం సిమ్లాలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
హిమాచల్ ప్రభుత్వ భాగస్వామ్యంతో సెలి (400 మెగావాట్లు), మీయర్ (120 మెగావాట్లు) హైడల్ ప్రాజెక్టులను తెలంగాణ జెన్కో నిర్మిస్తున్నది. ఈ రెండు ప్లాంట్లను తెలంగాణ జెన్కో నామినేషన్ పద్ధతిలో చేపడుతోంది. సెలి, మీయర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైడల్ ప్లాంట్లు హిమాలయ పరివాహక నదులపై ఉండడంతో ఏడాదిలో 9 నుంచి 10 నెలల పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి అనువుగా ఉంటుంది.
థర్మల్ పవర్ తో పోల్చితే పర్యావరణ హితమైన జల విద్యుత్తు ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉండనుంది. థర్మల్ పవర్ జనరేషన్ ఖర్చు ఏటా పెరుగుతుంది, కానీ హైడల్ పవర్ ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో తెలంగాణకు తక్కువ ఖర్చుతో పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ అందనుంది.
గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి: భట్టి
హిమాచల్ ప్రదేశ్‌తో ఎంఓయూ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో హిమాచల్ తో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు అని అన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
హిమాచల్ తో పోలిస్తే దక్షిణాది నదులపై జల విద్యుత్ ఉత్పత్తి పరిమితంగా ఉంటుందన్నారు. హిమాచల్ సహజ వనరులను వినియోగించుకుని రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే కరెంట్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. దేశ విద్యుత్ రంగంలో, ఇంటర్ స్టేట్ సహకారానికి హిమాచల్ ఒప్పందం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో స్టేట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూకీ, జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేశ్ ప్రజాపతి, స్పెషల్ సెక్రటరీ అరిందమ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.