ఆస్ట్రేలియా నుంచి క్రిటికల్​ మినరల్స్​ దిగుమతి...క్వీన్స్​లాండ్​ రాష్ట్రంతో ఒప్పందం కుదిరింది: డిప్యూటీ సీఎం భట్టి

ఆస్ట్రేలియా నుంచి క్రిటికల్​ మినరల్స్​ దిగుమతి...క్వీన్స్​లాండ్​ రాష్ట్రంతో ఒప్పందం కుదిరింది: డిప్యూటీ సీఎం భట్టి
  • 11 రకాల కీలక ఖనిజాల ఉత్పత్తికి పరస్పర సహకారం
  • అధికోత్పత్తి, లేటెస్ట్​ టెక్నాలజీ, రక్షణ, శిక్షణలో  కోపరేషన్​
  • నోడల్​ ఏజెన్సీగా సింగరేణిని నియమించినట్టు వెల్లడి
  • క్వీన్​ల్యాండ్ మంత్రి,  ప్రతినిధి బృందంతో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

హైదరాబాద్, వెలుగు:  ఎలక్ట్రికల్​ వెయికల్స్​, సోలార్ పవర్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్​కు డిమాండ్ నేపథ్యంలో వీటికి అవసరమైన క్రిటికల్​ మినరల్స్​ను ఆస్ట్రేలియాలోని క్వీన్​లాండ్​ నుంచి ఇంపోర్ట్​ చేసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో  క్వీన్స్ లాండ్ స్టేట్​ మినిస్టర్​ రోస్ బేట్స్, ఆ స్టేట్​ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి,  వ్యాపార విస్తరణపై చర్చించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనేడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం తదితర 11 రకాల క్రిటికల్​ మినరల్స్​ అవసరాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఖనిజాల లభ్యత  క్వీన్స్ లాండ్ లో అధికంగా ఉన్నందున  పరస్పర లబ్ధి చేకూరే బిజినెస్​ ఒప్పందంపై అవగాహనకు వచ్చామని తెలిపారు.

ఇండియాలో క్రిటికల్​ మినరల్​ మైనింగ్ లో తెలంగాణ కీలక భూమిక పోషించనుందని చెప్పారు. ఈ నేపథ్యంలో క్వీన్స్ లాండ్ తో క్రిటికల్​ మినరల్స్​ టెక్నాలజీ, మైనింగ్ రంగంలో పరస్పర సహకారం, భాగస్వామ్యానికి ముందడుగు వేయడం  శుభ పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర మైనింగ్ చరిత్రలో ఇది కీలక మైలురాయిగా నిలిచిపోనున్నదని అన్నారు. ఈ విషయంలో క్వీన్స్ లాండ్ బృందానికి  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారని చెప్పారు. 

నోడల్​ ఏజెన్సీగా సింగరేణి..

రాష్ట్రంలో  2029–2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించి.. దేశానికే అదర్శంగా నిలవాలని ప్లాన్​ చేస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయంలో క్వీన్స్​లాండ్​ సహకారం తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, క్వీన్స్ లాండ్​ మధ్య కంబైన్డ్​గా మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణిని ఒక నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామని చెప్పారు. సింగరేణి ఇప్పటికే క్వీన్స్ లాండ్​కు చెందిన సిమ్టార్స్ తో రక్షణ, సీఎస్ఐఆర్ఓ సంస్థలతో మైనింగ్, టెక్నాలజీకి సంబంధించి  ఒప్పందాలు చేసుకొని, సేవలు పొందుతున్నదని తెలిపారు.

ఇప్పుడు క్వీన్స్ లాండ్​  మంత్రి సమక్షంలో క్రిటికల్​ మినరల్స్​ వెలికితీత, భారీ యంత్రాలు, సాంకేతికత, రక్షణ పెంపుదల, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి  లేటెస్ట్ టెక్నాలజీ అంశాలపై పరస్పర అవగాహనతో వ్యాపార ఒప్పందం కోసం ముందుకుపోతున్నట్టు చెప్పారు. . త్వరలోనే  ఈ అంశాలపై అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి నుంచి బృందాన్ని క్వీన్స్ లాండ్ కు పంపుతున్నట్టు వెల్లడించారు. 

తెలంగాణకు సహకరిస్తం: క్వీన్స్​లాండ్ మంత్రి రోస్​బేట్స్​

మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సింగరేణితో ఇప్పటికే తమతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని క్వీన్స్ లాండ్​ మంత్రి  రోస్ బేట్స్ తెలిపారు.  క్రిటికల్​ మినరల్స్​ అయిన కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాం టీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ ఎర్త్ మినర ల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయ డానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్టు చెప్పారు.