ఫిలిప్పీన్స్​కు తెలంగాణ బియ్యం: లక్ష టన్నులు ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు

ఫిలిప్పీన్స్​కు తెలంగాణ బియ్యం: లక్ష టన్నులు ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు
  • 50 మిల్లుల ద్వారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ
  • మిల్లింగ్​ స్పీడ్​ పెంచాలని కమిషనర్ ఆదేశం
  • మొదటి విడతగా 15వేల టన్నుల ఎక్స్​పోర్ట్​..
  • మిల్లర్లకు క్వింటాల్​కు రూ.350 ఇన్​సెంటివ్స్!

హైదరాబాద్, వెలుగు: ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రైస్ ఎక్స్​పోర్ట్ కానున్నాయి. లక్ష టన్నులు సరఫరా చేయడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో మొదటి విడతగా 15 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇచ్చిన ధాన్యం మిల్లింగ్ స్పీడప్ చేసి ఎక్స్​పోర్ట్ కోసం బియ్యం సిద్ధం చేయాలని రైస్ మిల్లర్లకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇన్నాళ్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన బియ్యం పక్కదారి పట్టే పరిస్థితి ఉండేది. కొందరు అక్రమార్కులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఎక్స్​పోర్ట్​ చేసేవారు. వీటన్నింటికి అడ్డుకట్ట వేస్తూ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్​పోర్ట్ చేసేందుకు నిర్ణయించింది.

ఫలించిన మంత్రి ఉత్తమ్ చర్చలు

ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి  చేసేందుకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలోని 50 మిల్లర్ల నుంచి లక్ష టన్నుల బియ్యం సేకరిస్తున్నారు. గత యాసంగిలో నల్లగొండ, యాద్రాద్రి, సూర్యాపేట, మెదక్, ఖమ్మం జిల్లాల్లో పండిచిన 1010, 1064 వరి ధాన్యం రకాలు క్వాలిటీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రకం బియ్యాన్ని లక్ష టన్నులు ఫిలిప్పీన్స్‌‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర సర్కారు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ ఈ వెరైటీల రైస్ క్వాలిటీని పరిశీలించి నిర్ధారించారు. ధాన్యానికి టెస్ట్‌‌ మిల్లింగ్‌‌ నిర్వహించి, ఎక్స్​పోర్ట్ క్వాలిటీకి ఉండాల్సిన ప్రమాణాలను పరిశీలించి ఓకే చేశారు.

ఇటీవల ఫిలిప్పీన్స్‌‌ ప్రభుత్వ ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. లక్ష టన్నుల బియ్యాన్ని ఇంపోర్ట్ చేసుకునేందుకు ఫిలిప్పీన్స్‌‌ అంగీకారం తెలిపింది. తొలి విడతగా గత యాసంగి సీజన్ కు సంబంధించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసి 15 వేల టన్నుల బియ్యాన్ని ఎక్స్​పోర్ట్ చేయడానికి సివిల్ సప్లయ్స్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మిల్లింగ్ స్పీడప్​చేయాలని మిల్లర్లను ఆదేశిస్తూ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

నూకలు 5 శాతమే ఉండే బియ్యం

బియ్యం సరఫరా చేసేందుకు 50 మిల్లులు సివిల్ సప్లయ్స్ అధికారులు  చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సీఎంఆర్ కు నూకలు25 శాతంతో ఎఫ్​సీఐకి అప్పగించే పరిస్థితి ఉండేది. ఫిలిపెన్స్​తో కుదిరిన ఒప్పందంలో 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అధికారులు ఇన్​సెంటివ్స్ ఇస్తామనడంతో మిల్లర్లు అంగీకారం తెలిపారు.  నూకలు 5శాతం ఉండేలా ఇచ్చే బియ్యానికి క్వింటాల్​కు రూ.350 మిల్లర్లకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

కాకినాడ నుంచి ఎక్స్​పోర్ట్

సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ మిల్లర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్ పోర్ట్ చేయనుంది. రాష్ట్రం నుంచి పోర్ట్ వరకు రవాణాకు అయ్యే చార్జీలను సివిల్ సప్లయ్స్ శాఖ భరించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పీడీఎస్​ బియ్యం పక్కదారి పట్టి అవి కాకినాడ పోర్ట్ ద్వారా విదేశాలకు ఎక్స్​పోర్ట్ అయ్యే పరిస్థితి ఉండేది. తాజాగా ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో పీడీఎస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టింది. తాజాగా ఫిలిప్పీన్స్​తో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విదేశాలకు ఎక్స్​పోర్ట్ చేసేలా కార్యచరణ సిద్ధం చేశారు.