
- డిప్యూటీ సీఎం సమక్షంలో రెడ్కోతో కంపెనీల ఒప్పందాలు
- రూ.27 వేల కోట్లతో ఎకోరేన్ ఎనర్జీ ఇండియా ప్రాజెక్టులు
- రూ.2 వేల కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన న్యూ ఎనర్జీ పాలసీతో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్ రాజేందర్ నగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో డిప్యూటీ సీఎం సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడ్కోతో ఎకోరేన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జీపీఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు అధిగమించి త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో రూ.27 వేల కోట్ల పెట్టుబడులతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఎకోరేన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. జీపీఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయో-గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. వరి సాగు పెరుగుతున్న నేపథ్యంలో వరి గడ్డితో తయారు చేసే కంప్రెస్డ్ బయోగ్యాస్ వల్ల రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తుందని, అదనంగా ఉత్పత్తి జరిగితే ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకోవచ్చని తెలిపారు.
త్వరలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన సందర్భంగా సన్ పెట్రో కంపెనీ 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నదని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. అదేవిధంగా మేఘా కంపెనీ రూ.7,500 కోట్లతో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ రెండు కంపెనీలు డీపీఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయన్నారు. త్వరలో రాష్ట్రంలో ఈ రెండు కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తాయని భట్టి చెప్పారు.
భారీగా పెరగనున్న విద్యుత్ అవసరాలు
రాష్ట్రంలో 2023 ఏడాదిలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరగా, ఈ యేడు మార్చి 20న 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ కు చేరుకుందని భట్టి తెలిపారు. ఏడాదిన్నరలోపే ఇంత భారీగా డిమాండ్ పెరుగుతున్నప్పటికీ పకడ్బందీ వ్యూహంతో అంతరాలయాలు లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేశామని చెప్పారు. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు రానుండటంతో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు మరింతగా పెరుగుతాయన్నారు.