తెలంగాణ సాలులో సాయి

తెలంగాణ సాలులో సాయి

ఏ యాడాదో యాదికి లేదు. ఆ దినం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముంగట తెలంగాణ కోసం పే...ద్ద సభ. అప్పటికే రాత్రి అయింది. విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నరు. ఇంతల్నే ఓ యువకుడు మైక్ అందుకొని...

‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా..’

...అని మిట్టపల్లి సురేందర్ రాసిన పాట పాడుతుంటే అందరి కండ్లల్ల నీళ్లు తిరిగినయి. ఉద్యమంల అప్పటికే ఎందరో అమరులైండ్రు. మోకాళ్లపై కూర్చోని ఆ తల్లుల కడుపు కోతను గానం జేస్తుంటే.. ఆడికెల్లి ఎవ్వలం కదల్లేకవోయినం. ఈయినె ఎవలాఅని పక్కొళ్లను అడిగితే సాయిచంద్ అన్నడు. అప్పటిసంది ఇప్పటిదాకా సాయిచంద్ అనంగనే నాకైతే ఆ పాటే, ఆ జ్ఞాపకమే యాదికొస్తది. ఎన్నడన్న కలిస్తే గిదే మాట చెప్పేటోన్ని. ఇగ ఆ అవకాశమే లేకుంటైంది.
1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింత ఊర్ల అరుణోదయ వెంకట్రాములు కడుపున పుట్టిండు. పలక మీద అక్షరాలు దిద్దుకుంట.. నోటి నిండ పాటలు నేర్శిండు. అరుణోదయల ఆడిపాడి... తెలంగాణ ఉద్యమంలకు దుంకిన దళిత బిడ్డ. 

ఉద్యమ జెండావట్టి అమరుల త్యాగాలను గానం జేస్తూ... రాష్ట్ర అవశ్యకతను చెబుతూ...10 జిల్లాలు తిరిగిన పాలమూరు పాటగాడు. తెలంగాణ వచ్చిన తర్వాత గుండె మీద గులాబీ జెండా పెట్టుకోని తిరిగిండు. రసమయి ఎమ్మెల్యే అవుడుతోటి... పార్టీ పాటలకు సాయిచందే పెద్ద దిక్కయిండు. బీఆర్​ఎస్​ ఏడ మీటింగ్ పెట్టినా గంట గంటన్నర ముందు నుంచే సాయిచంద్ ఆటపాటలు ఉండేటియి. ఉద్యమ పాటలు, పార్టీ పాటలు మంచి ఊపు మీద పాడేటోడు. స్టేజీ పైకి కేసీఆరో, కేటీఆరో, హరీశ్ రావో వొచ్చేదాకా... సభను మొత్తం తానే నడిపేటోడు. ముంగటున్నోళ్లేగాదు... స్టేజీ మీదున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సప్పట్లు కొడుతు, తువ్వాలు ఊపుతూ, డ్యాన్సులాడిన సందర్భాలెన్నో. పాటలేగాదు.. మాటలు గూడ అట్లనే ఉంటుండే. అట్ల అట్ల ఇంకింత దగ్గరైండు పబ్లిక్కు. తెలంగాణల ఎమ్మెల్యేలు తెల్వనోళ్లు ఉన్నరేమో గని... సాయిచంద్ తెల్వనోళ్లు శాన తక్కువ. 

2019 నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నం చేశినా అందలే. 2021ల ఎమ్మెల్సీగా పేరు ఫైనల్ అయిందని ప్రచారమైనా... ఎందుకో అది గూడ దక్కలే. ఉద్యమంల లేనోళ్లకు, తెలంగాణను వ్యతిరేకించినోళ్లకు పెద్దపెద్ద పదవులొచ్చి.. గిసొంటి ఉద్యమకారులకు ఎందుకు ఇయ్యరనే చర్చ ఎప్పుడూ ఉండేదే. అప్పుడప్పుడు స్వేరో సభల్లో, దళిత సభల్ల గిట్ల ప్రశ్నించేటోడు.

‘ఎవ్వడు జెప్పిండురా మేం తక్కువ జాతోళ్లని..
మీకు ఏడ రాసిన్రురా మీరెక్కువ జాతోళ్లని
నిన్ను నన్ను కన్న తల్లి భారతమ్మ ఒక్కత్తే
నువ్వు నేను బతుకుతున్న భరతభూమి ఒక్కటే
కాని నీకు నాకు నడ్మ కులం అడ్డుగోడ ఏందిరా..’

ఇప్పుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నా కళాకారుడిగానే గుర్తింపు సంపాయించిండు. వచ్చే ఎన్నికల్ల అలంపూర్ టికెట్ కోసం ప్రయత్నాలు జేస్తుండట. ఈ నడ్మనే లోకల్ ఎమ్మెల్యే అనుచరులతోటి లొల్లి గూడైంది. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న సాయిచంద్ 39 ఏండ్లకే కాలం చేయడం బాధాకరం. భార్యను ఓదార్సుడు ఎవల తరమైతలేదు. నాయ్న ఏడుస్తుంటే సూశేటోళ్లకు దుఖ్ఖం ఆగలే. ఇద్దరు చిన్న పిల్లలు తండ్రి లేనోళ్లైండ్రు. మున్పు ఓపారి గుండెపోటు వచ్చిందట. పైలంగా ఉండాలని డాక్టర్లు చెప్పిర్రని దగ్గెరోళ్లు గుర్తు జేస్తుండ్రు. పార్టీ కోసానికి ఇంత కష్టవడ్డడు గావట్టే... ఆఖరి సూపుకు మంత్రులు, ఎమ్మెల్యేలంతొచ్చిండ్రు. కడ్మ పార్టీల లీడర్లు, కార్యకర్తలొచ్చి జ్ఞాపకాలు పంచుకున్నరంటే... దానికి కారణం ఉద్యమంలో సాయిచంద్ పాత్ర. పార్టీ పాటలు ఎన్ని పాడినా.. రాతి బొమ్మలోన కొలువైన శివుడా పాటనే అందరు యాజ్జేస్తుర్రంటే కారణం ఉద్యమ సాయిగా గుర్తింపు. 

తెలంగాణకు పాటల గూడు కట్టిన గూడ అంజన్న కాలం జేస్తే.. నివాళి అర్పిస్తానికి సీఎం రాలే. బీఆర్​ఎస్​ కోసం కాళ్లకు గిర్కల కట్కోని ఏడ మీటింగ్ పెడితే ఆడికి ఉరికి పాడిన సాయిచంద్ ను సూస్తానికన్న వొస్తడా లేదాని శాన మందికి డౌటుండే. కేసీఆర్ సారొచ్చి నివాళ్లు అర్పించి… ఇంటోళ్లను ఓదార్శి, ధైర్నం జెప్పుడు మంచి ముచ్చట. అట్లనే గా తెలుగు శిన్మ హీరోలలెక్క.. మన తెలంగాణ ఉద్యమ కళాకారుడికి గూడ అధికార లాంఛనాలతో అంత్యక్రియాలు జేస్తే ఇంకా బాగుండే. ఆటపాటల సాయిచంద్ కు జోహార్లు.

రఘు భువనగిరి