ఆన్​లైన్ బెట్టింగ్ యాప్​లపై సిట్ దర్యాప్తు స్పీడప్

ఆన్​లైన్ బెట్టింగ్ యాప్​లపై  సిట్ దర్యాప్తు స్పీడప్
  • డీజీపీ ఆఫీస్​లో తొలి సమావేశం
  • బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కట్టడికి ప్రణాళికలు
  • రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్న సిట్
  • సీఐడీ చీఫ్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ల కట్టడికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌‌ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన బెట్టింగ్‌‌ కేసులు, బాధితుల ఆత్మహత్యలు చేసుకున్న కేసుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్‌‌ మొదలు పెట్టింది. ఈ మేరకు సీఐడీ చీఫ్‌‌ శిఖాగోయల్ ఆధ్వర్యంలో గురువారం మొదటి సమావేశం జరిగింది. బెట్టింగ్‌‌, గేమింగ్‌‌పై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌‌ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్‌‌‌‌ నాలుగు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఐజీ ఎం.రమేశ్ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్‌‌ ఎస్పీ చంద్రకాంత్‌‌, డీఎస్పీ శంకర్‌‌తో సీఐడీ చీఫ్‌‌ సమావేశం నిర్వహించారు. సిట్‌‌ సభ్యులతో పలు కీలక అంశాలపై చర్చించారు. దర్యాప్తులో ప్రధానంగా బెట్టింగ్ యాప్స్‌‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు.

కేసుల దర్యాప్తుకు స్పెషల్ ఫార్మాట్

బెట్టింగ్‌‌ యాప్స్‌‌ ప్రకటనల్ని నిషేధించడంతో పాటు రాష్ట్రంలో చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన మార్పులు చేయడం సహా తదితర విషయాలపై సిట్ దృష్టి సారించింది. యాప్స్‌‌ కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై భవిష్యత్‌‌ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌‌ యాప్స్‌‌కు సంబంధించి నమోదైన కేసులతో రిపోర్ట్‌‌ తయారు చేస్తున్నారు. కేసుల దర్యాప్తునకు ప్రత్యేక ఫార్మాట్‌‌ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే బెట్టింగ్‌‌ కేసులు దర్యాప్తు జరుపుతున్న అధికారులతో త్వరలోనే సిట్‌‌ మరోసారి సమావేశం నిర్వహించనున్నది. పోలీసులతో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సహకారంతో బెట్టింగ్‌‌ యాప్స్‌‌ కట్టడిపై సమగ్ర నివేదిక రూపొందించి 90 రోజుల్లోగా డీజీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిట్‌‌ నివేదిక అందజేయనున్నది.