ర్యాట్ హోల్ మైనర్స్ వాపస్.. టన్నెల్ లోపల కూలే ప్రమాదం ఉందని వెనక్కి వెళ్లిపోయారు..!

ర్యాట్ హోల్ మైనర్స్ వాపస్.. టన్నెల్ లోపల కూలే ప్రమాదం ఉందని వెనక్కి వెళ్లిపోయారు..!

నాగర్ కర్నూల్/మహబూబ్ నగర్: ఎస్ఎల్బీసీ టెన్నల్ సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ నుంచి రప్పించిన ర్యాట్ హోల్ మైనర్స్ చేతులెత్తేశారు. టన్నెల్ లోపల కూలే ప్రమాదం ఉందని, తాము ఈ ఆపరేషన్లో పాల్గొనలేమని చెప్పేశారు. తాము వెనక్కి వెళ్లిపోతున్నట్టు వెల్లడించారు. ‘నిన్న సాయంత్రం వెళ్లినప్పుడు13.50 కిమీల దగ్గర 22,23 బ్లాక్స్ చాలా లూస్‌గా ఉన్నాయి. సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ ఫిక్స్ చేసిన గోడల నుంచి నీటి ఊటలు వస్తున్నాయి. కింది నుంచి, పక్కల నుంచి నీరు ఊరుతుంది. ఏ క్షణంలోనైనా సిమెంట్ సెగ్మెంట్స్, పై నుంచి మట్టి కూలే ప్రమాదం ఉంది.ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. మేము తిరిగి వచ్చేశాం.

రాట్ హోల్ మైనర్స్ టీం నుంచి 11 మంది వెళ్లాం.మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది. టన్నెల్ లో టీబిఎం శిథిలాలు కనిపించే చివరి ఏరియా వరకు వెళ్లాం. మాకు ఎవరూ కనిపించలేదు. నీళ్ళు దుంకుతున్న శబ్దం తప్ప వేరే ఏం వినిపించడం లేదు. సజీవంగా ఉన్నారన్న ఆశలు లేవు. బురద,నీటి ప్రవాహం,శిధిలాల మధ్య లోపల పరిస్థితి చాలా భయానకంగా ఉంది. మట్టి,సిమెంటు సెగ్మెంట్స్ ఎప్పుడు కూలుతాయో తెలియదు. డెహ్రాడూన్ - ఉత్తర కాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడినం. ఇక్కడి టన్నెల్ లో జరిగిన ప్రమాదం గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చాలా రిస్క్. రెస్క్యు ఆపరేషన్ లో పాల్గొంటున్న వారికి రిస్క్ ఎక్కువే’ అని ర్యాట్ హోల్ మైనర్స్ తెలిపారు.