ఎప్పుడూ బిజీగా కళకళలాడిన హైదరాబాద్ లాంటి నగరం, పండుగరోజు మాత్రం ఖాళీ రోడ్లతోనే కనిపిస్తుంది. సాధారణంగా దసరా రోజున దుర్గ అమ్మవారికి, శ్రీరాముడికి, ఆంజనేయస్వామికి పూజలు చేస్తారు. కొన్నిచోట్ల ఉదయం, సాయంత్రం పూజలు చేస్తారు.అలయ్ బలయ్ చెప్పుకుంటూ.. ఎంతో సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఎక్కువ ఊళ్లలో మాత్రం దసరా పండుగంటే సాయంత్రం జరిగే పూజలే. పొద్దున ఇష్టమైన వంటలన్నీ చేసుకొని తిని, సాయంత్రానికి చక్కగా తయారై గుళ్లకు వెళ్తుంటారు.
పెద్దలు, పిల్లలు. మధ్యాహ్నం ఇంట్లో చికెన్, మటన్.. లాంటి నాన్ వెజ్ వంటలే వండుకున్నా కూడా. సాయంత్రానికి గుడికి వెళ్తుంటారు చాలా ఊళ్లలో ఈ ఒక్క రోజు మాత్రం ఇలాంటి వాటిల్లో దేవుడు 'మాఫీ' చేస్తాడనే మాట చాలామంది చెప్తారు. సాయంత్రానికి గుడికెళ్లే అలవాటున్న ఇళ్లలో పిల్లలు పొద్దున్నుంచే కొత్త బట్టలు వేసుకోవాలని చేసే అల్లరి. మామూలుగా ఉండదు. సిటీలు, పట్టణాల్లో అయితే దగ్గర్లోని గుళ్లకే వెళ్తుంటారు. పల్లెలో మాత్రం దసరా రోజు అందరూ ఊరవతల ఉన్నట్టుండే ఆంజనేయస్వామి గుడికో, రాముడి గుడికో వెళ్తుంటారు. జమ్మి చెట్టుకి మొక్కడం సంప్రదాయంగా వస్తుంది.
ఎన్నెన్నో పురాణ కథలు
ఏ యుగంలోనైనా చెడుకి, మంచికి ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందులో చెడుపై మంచి గెలుస్తూనే ఉంటుంది. ఆ గెలుపును ఒక వేడుకలా జరుపుకోవడమనే ఫిలాసఫీ దసరా పండుగలో ఉంది. దసరా పండుగ వెనుక ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. మహిషాసురుడనే రాక్షసుడ్ని దుర్గాదేవి చంపిన ఆనందంలో దసరా పండుగ చేసుకుంటారన్నది మనకు ప్రధానంగా వినిపించే కథ ఇది కాకుండా రామాయణ,మహాభారతాల్లోనూ దసరా పండుగ ఎందుకు చేసుకుంటామనే దానికి కథలున్నాయి. ఈ అన్ని కథల్లోనూ... చెడుపై విజయమే ప్రధానమైన అంశం. అన్ని కథల్లోనూ చెడుపై మంచికి విజయం 'దశమి' రోజునే దక్కింది. అందుకే 'విజయ దశమి' అయ్యింది ఈ రోజు. వీటిల్లో ఏ కథను లెక్కలోకి తీసుకున్నా, అది విజయదశమే. మనందరం వైభవంగా చేసుకుంటున్న పెద్ద పండుగే.
భక్తి ఒక్కటే కాదు.
చెడుపై మంచి సాధించే విజయమే ఈ పండుగని చెప్పుకున్నాం కదా! ఇది మానవుడికి మరింకెన్నో రూపాల్లో కూడా గొప్ప పండుగ ఎందుకంటే చీకటి నుంచి వెలుగు వైపునకు చేసే ప్రయాణం ఈ పండుగ. అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు అడుగులు వేయడం కూడా ఈ పండుగలో ఉన్న ఫిలాసఫీనే. అందుకే ఈ పండుగలో దేవుడిని పూజించడం అన్న ఆలోచన, భక్తి ఒక్కటే ఉండదు.
బంధువులు, స్నేహితులను కలుసుకొని 'అలయ్ ఐలయ్ ఇచ్చుకోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం, అందరితో కలిసి రావణదహనంలో పాల్గొనడం దసరా రోజు కనిపిస్తుంది. ఇది చెడుపై పోరాటానికి అందరూ ఏకం కావాలన్న ఆలోచనను గుర్తు చేస్తుంది. ఏ పండుగ అయినా ఎక్కడెక్కడో వాళ్ల వాళ్ల ఉద్యోగాల కోసం వెళ్లిపోయిన మనుషులందరినీ ఒక్కటి చేస్తుంది. బస్ టికెట్ రేట్లు పెరిగినా. రైళ్లలో నిలబడటానికి చోటు కూడా లేకున్నా సొంత ఊళ్లకు అందరూ పండుగ వస్తున్నదంటే 'క్యూ'కడుతున్నారంటే, ఆ పండుగ చిన్న పండుగ కాదు.ఈ దసరా అందరికీ విజయాన్ని చేకూరుస్తుందనికోరుకుందాం.
–వెలుగు, దసరా ప్రత్యేకం–