కిచెన్ తెలంగాణ : చినుకుల్లో  చిరుతిళ్లు

కిచెన్ తెలంగాణ : చినుకుల్లో  చిరుతిళ్లు

చిటపట చినుకులు పడుతుంటే... వేడి వేడిగా శ్నాక్స్ తింటూ ఎంజాయ్​ చేస్తుంటే.. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. మరింకెందుకాలస్యం... నోరూరించే చిల్లీ పనీర్, రైస్ మంచూరియా, హాట్​ హాట్ ఎగ్​ పఫ్, పెసర పునుగులు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చదివేయండి. 

చిల్లీ పనీర్

కావాల్సినవి :

పనీర్ ముక్కలు : పావు కిలో

నూనె, ఉప్పు, నీళ్లు : సరిపడా

మిరియాల పొడి : చిటికెడు

కార్న్​ఫ్లోర్ : పావు కప్పు  

వెల్లుల్లి రెబ్బలు : పదిహేను

అల్లం : చిన్న ముక్క,  

పచ్చిమిర్చి : 8

చక్కెర, వెనిగర్ : ఒక్కో టీస్పూన్ 

సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ : ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్స్​

ఉల్లిగడ్డ,  క్యాప్సికమ్ ముక్కలు : కొన్ని

తయారీ : ఒక గిన్నెలో పనీర్​ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కార్న్​ ఫ్లోర్ వేసి కలపాలి. కొన్ని నీళ్లు చల్లి మరికొంచెం కార్న్​ ఫ్లోర్ వేయాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో పనీర్​ ముక్కల్ని  వేగించాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేగించాలి. అందులో కొన్ని వేడి నీళ్లు పోసి, సోయా సాస్, పచ్చిమిర్చి పేస్ట్​, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్​ఫ్లోర్, నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని కూడా అందులో పోయాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక ఉప్పు, పనీర్​ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు వేసి
కలిపితే చిల్లీ పనీర్​ రెడీ. 

ఆలూ - మటర్

కావాల్సినవి :

గోధుమ పిండి : ఒక కప్పు

నూనె, ఉప్పు, నీళ్లు : సరిపడా 

వాము, జీలకర్ర, పసుపు, గరం మసాలా : ఒక్కోటి అర టీస్పూన్

మొలకెత్తిన పచ్చి బటానీలు : ఒక కప్పు

పచ్చిమిర్చి : మూడు

ఆలుగడ్డ, ఉల్లిగడ్డ : ఒక్కోటి

అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం : ఒక్కో టీస్పూన్

కార్న్​ ఫ్లోర్ : నాలుగు టేబుల్ స్పూన్లు.

తయారీ :  ఒక గిన్నెలో గోధుమ పిండి, వాము, నూనె, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. మిక్సీజార్​లో మొలకెత్తిన పచ్చి బటానీ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ తరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. ఆ తర్వాత అందులో ఆలూ బటానీ మిశ్రమం కూడా వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఆ పై పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి.  ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్, నూనె వేసి పేస్ట్​లా కలపాలి. రెడీ చేసిన పిండి ముద్దను ఉండలు చేసి, చపాతీల్లా వత్తాలి. ఒక్కో చపాతీకి ఆ పేస్ట్​ పూసి, పిండి చల్లాలి. అలా నాలుగైదు చపాతీలను చేసి ఒకదానిపై ఒకటి పేర్చాలి. తర్వాత వాటన్నింటిని రోల్​లా చుట్టి, రింగులుగా కట్ చేయాలి. వాటిని మరోసారి చపాతీల్లా వత్తి, నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఒక్కోదాంట్లో ఆలూ బటానీ స్టఫ్ పెట్టి  మూసేయాలి. వీటిని వేడి నూనెలో వేగిస్తే ఆలూ మటర్ పఫ్ తినడానికి రెడీ. 

రైస్ మంచూరియా

కావాల్సినవి :

అన్నం : ఒక కప్పు

క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టొమాటో : ఒక్కోటి

పచ్చిమిర్చి : రెండు 

ఉప్పు : సరిపడా

కారం, నిమ్మరసం : ఒక్కో టీస్పూన్

ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా : ఒక్కోటి అర టీస్పూన్

జీలకర్ర పొడి : పావు టీస్పూన్

మైదా : అర కప్పు 

కార్న్​ ఫ్లోర్ :  రెండు టీస్పూన్లు

టొమాటో కెచప్ : నాలుగు టీస్పూన్లు

తయారీ : మిక్సీజార్​లో అన్నం వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.  ఒక గిన్నెలో మెత్తగా చేసిన అన్నం, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అందులో ఉప్పు, కారం,  ధనియాల పొడి,  జీలకర్ర పొడి, మైదా, కార్న్​ ఫ్లోర్, నిమ్మరసం కూడా వేసి కలపాలి. చేతికి నూనె రాసుకుని తయారుచేసిన మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి.  అలా చేసిన వాటిని వేడి నూనెలో వేగించాలి. 

సాస్​ కోసం..   

ఒక పాన్​లో నూనె వేడి చేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో తరుగు ఒక్కోటి వేగించాలి. ఆ తర్వాత ఉప్పు,  ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కారం, టొమాటో కెచప్ వేసి కలపాలి. చివరిగా వేగించిన రైస్​ బాల్స్​ను  అందులో వేసి కలిపితే రైస్​ మంచూరియా  రెడీ.

పెసర పునుగులు

కావాల్సినవి 
పెసరపప్పు : ఒక కప్పు
ఉప్పు : సరిపడా
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి : రెండు
కరివేపాకు : కొంచెం 
మిరియాల పొడి :  ఒక టీస్పూన్

తయారీ : 
ఒక గిన్నెలో పెసరపప్పు వేసి, నీళ్లు పోసి కడిగాక నాలుగైదు గంటలు నానబెట్టాలి. మిక్సీజార్​లో నానబెట్టిన పెసరపప్పు గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేడి నూనెలో బోండాల్లా వేయాలి. అవి బాగా వేగాక ప్లేట్​లోకి తీయాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటాయి.

ఎగ్​ పఫ్

కావాల్సినవి
గోధుమ పిండి : రెండు కప్పులు
కోడిగుడ్లు (ఉడికించి) : నాలుగు
ఉప్పు, నీళ్లు, నూనె : సరిపడా
వెన్న : మూడు టీస్పూన్లు
పచ్చిమిర్చి : మూడు , 
ఉల్లిగడ్డలు / టొమాటోలు : రెండేసి చొప్పున
కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్​ : ఒక్కో టీ స్పూన్

తయారీ : 
గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, వెన్న వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. దాన్ని చపాతీలా వత్తి, నూనె రాసి నాలుగు వైపులా మడతపెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో పెట్టి మూతపెట్టి పక్కనపెట్టాలి.  ఒక పాన్​లో నూనె వేడి చేసి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, ఉప్పు వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్​, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.  ఆ తర్వాత గిన్నెలో పెట్టిన పిండిని ఉండలు చేయాలి. తరువాత వాటిని చపాతీలా వత్తి, నూనె రాసి నాలుగు వైపులా మడతపెట్టి మరోసారి వత్తాలి. ఇలా మూడు లేదా నాలుగుసార్లు చేశాక, నాలుగు భాగాలుగా కట్ చేయాలి. ఒక్కోదాంట్లో రెడీ చేసిన స్టఫింగ్​తోపాటు సగానికి కోసిన కోడిగుడ్డు పెట్టి మూసేయాలి. ఇడ్లీ ప్లేట్​కి నూనె రాసి, వాటిని అందులో పెట్టాలి. మరో పాన్​లో చిన్న గిన్నె బోర్లించి, దానిపై ఇడ్లీ ప్లేట్ పెట్టి మూతపెట్టాలి. కాసేపటి తర్వాత మూత తీసి వాటిని రెండోవైపు తిప్పాలి. మళ్లీ మూతపెట్టి ఉడికిస్తే  ఎగ్​ పఫ్​ రెడీ.