మహారాష్ట్ర ప్రచారంలో రాష్ట్ర నేతల బిజీ బిజీ

మహారాష్ట్ర ప్రచారంలో రాష్ట్ర నేతల బిజీ బిజీ
  • పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ నేతల క్యాంపెయిన్
  • బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు హాజరు
  • కాంగ్రెస్ నుంచి​ మంత్రులు ఉత్తమ్, సీతక్క, వెంకట్​రెడ్డి, ఎంపీలు మల్లు, చామలవిస్తృత ప్రచారం
  • రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • నాడు హడావుడి చేసి.. నేడు పత్తాలేని బీఆర్ఎస్

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఈ నెల 20న ఆ రాష్ట్రంలో పోలింగ్ ఉండడంతో ప్రచారానికి 18తో గడువు ముగియనుంది. దీంతో తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు అక్కడే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని ముగించారు. 

బుధవారం వర్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం చివరి విడత ప్రచారం కోసం ఆయన ముంబై వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల్ రావు, ఇతర కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలోని తెలుగు వారు అధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. 

మరఠ్వాడ ప్రాంతంలో మంత్రుల ప్రచారం..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరఠ్వాడ ప్రాంతంలోని లాతూర్​లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ తో కలిసి పలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మంత్రి సీతక్క కూడా మరఠ్వాడ ప్రాంతంలోని పలు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. తెలుగు వారు అధికంగా ఉన్న షోలాపూర్ ప్రాంతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. 

యావత్మాల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి, చంద్రాపూర్ జిల్లాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల్ రావు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ రాష్ట్రానికి కాంగ్రెస్ తరఫున ఎలక్షన్ ఇన్​చార్జ్​గా వ్యవహరిస్తున్నారు. గత నెల రోజులుగా పలు దఫాలు అక్కడ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మధ్య మధ్యలో రాష్ట్రానికి వస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 

ముంబై, నాగ్​పూర్​లో  కేంద్ర మంత్రుల క్యాంపెయిన్..

బీజేపీ తరఫున రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి, ఇతర నేతలు ఆ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ముంబై సిటీలో తెలుగు వారు అధికంగా ఉన్న పలు ఏరియాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నాగ్ పూర్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముంబై సిటీలోని పలు నియోజకవర్గాలో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనాల్లో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో కలిసి పాల్గొన్నారు. 

పాగా వేస్తామని.. పత్తాలేని బీఆర్ఎస్..

మహారాష్ట్రలో పాగా వేస్తామని గతంలో హడావుడి చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు అక్కడ పత్తా లేకుండా పోయింది. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అక్కడి సీనియర్ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మహారాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటామని చెప్పడంతో కొంత కాలం అక్కడి రాజకీయాల్లో  కేసీఆర్ పై చర్చ సాగింది. తీరా ఎన్నికల సమయంలో అక్కడి రాజకీయాలకు బీఆర్ఎస్​ దూరమైంది. దీంతో కేసీఆర్​ను నమ్ముకొని బీఆర్ఎస్​లో చేరిన అక్కడి నేతల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.