- అందెశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి
- జూన్ 2న ఆవిష్కరించనున్న సోనియాగాంధీ
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అందెశ్రీ, కీరవాణి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ దాదాపు 90 సెకండ్ల నుంచి 120 సెకండ్ల నిడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానుంది. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియాగాంధీ చేతుల మీదుగా ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో అందెశ్రీ, కీరవాణి సమావేశమయ్యారు. అందెశ్రీ ఒరిజినల్ రచనలోని భావం, ఆత్మ దెబ్బ తినకుండా ఆయన సమ్మతితో కొన్ని మార్పులు చేసి.. పాట నిడివి ఒకటిన్నర నిమిషాల నుంచి రెండు నిమిషాల వరకు ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ పోరాట చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ప్రతిబింబించే రీతిలో గీతం సాగుతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను.. నాడు స్కూళ్లు, కాలేజీల్లో ప్రార్థనా గీతంగా కూడా పాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పాట రాష్ట్ర గీతంగా ఉంటుందని అంతా భావించినా.. గత ప్రభుత్వం మాత్రం పక్కనపెట్టింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా అమలులోకి తెస్తున్నట్టు ప్రకటిం చారు. కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు.