జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ గీతాన్ని స్వరపరిచే భాధ్యతను ఆస్కార్ విజేత ఎంఎం కేరవానికి అప్పగించారు గీత రచయిత అందెశ్రీ. అయితే పలు వివాదాల నడుమ ఈ పాత్ర రికార్డింగ్ పూర్తయ్యింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతం ప్రజల ముందుకు రానుంది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని ఆలపించే అవకాశాన్ని యువ సింగర్స్ రేవంత్, హారిక నారాయణ్ దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించారు సింగర్ హారిక నారాయణ్. రాష్ట్ర గీతాన్ని ఆలపించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని పాడటం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో నన్ను చేర్చుకున్నందుకు అందె శ్రీ గారికి, కీరవాణి సార్‌కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది.. అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు హారిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.