- రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ న్యాబ్ స్పెషల్ ఆపరేషన్ షురూ
- కల్తీ కల్లు ఘటనలు, మృతుల వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు
- గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి అండదండలున్నట్లు ఆరోపణలు
- లింక్ ఛేదించే క్రమంలో పలువురిపై కేసులు
మహబూబ్‌నగర్, వెలుగు: కల్తీ కల్లును అరికట్టడానికి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) రంగంలోకి దిగింది. కల్తీ కల్లు ఘటనలు జరిగిన జిల్లాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన కల్తీ కల్లు ఘటనలు, తాగి చనిపోయిన వారి డేటా సేకరిస్తోంది. అలాగే ఆ కేసుల ఆధారంగా కల్తీ కల్లు తయారీకి వాడే అల్ర్ఫాజోలం లింక్ చైన్‌ను ట్రేస్ చేస్తోంది. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కల్తీ కల్లుకు ఓ ప్రజా ప్రతినిధి అండదండలున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేసేందుకు టీఎస్ న్యాబ్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
రెండు రోజులుగా అరెస్టులు, కేసులు..
ఐదు రోజులుగా టీఎస్ న్యాబ్ టీమ్ జిల్లాల్లో పర్యటిస్తోంది. అల్ర్ఫాజోలం చైన్ లింక్‌ను ట్రేస్ చేసి కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లా సూరారంలో తనిఖీలు నిర్వహించి నరేందర్, సతీశ్అనే సప్లయర్ల నుంచి 10 కిలోల అల్ర్ఫాజోలంను స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో లింగయ్యపై కేసు నమోదైంది. ఆయన రాష్ట్రంలో అల్ర్ఫాజోలంను సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈయన నెట్‌వర్క్‌లోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై కూడా కేసు నమోదైంది.
ఇదే జిల్లాకు చెందిన మరో ఆరుగురు ముస్తేదారులను టీఎస్ న్యాబ్ అరెస్ట్ చేసింది. మెదక్ పట్టణంలో కారులో తరలిస్తున్న నాలుగు కిలోల అల్ర్ఫాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా మామిద్గికి చెందిన చిన్నషేరి శంకర్, సంజీవ్ రావ్ పేటకు చెందిన తద్కల్ సాయిబాబా, కామారెడ్డి జిల్లా రామేశ్వర్పల్లికి చెందిన లింగాల రాజ, తాండూర్‌కు చెందిన భూమా విఠల్, సికింద్రాబాద్‌లోని మెట్టుగూడకు చెందిన సందిల్ల కృష్ణ అలియాస్ కిరణ్‌లను అరెస్ట్ చేశారు.
అయితే కల్తీ కల్లు ఎక్కువగా అమ్మకాలు జరిగే మహబూబ్‌నగర్ జిల్లాపై టీఎస్ న్యాబ్ ఆఫీసర్లు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో జరిగిన ఘటనలు, కేసులు, అల్ర్పాజోలం ఎక్కడి నుంచి వస్తుందనే వ్యవహారంలో కీలక విషయాలు తెలుసుకున్నట్లు తెలిసింది.
ఏప్రిల్‌లో పాలమూరులో హైడ్రామా..
ఈ ఏడాది ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కల్తీ కల్లుపై హైడ్రామా నడిచింది. మోతాదుకు మించి కల్లులో అల్ర్ఫాజోలం కలపడంతో ఏప్రిల్ 7న కల్తీ కల్లు బాధితులు ఒక్కొక్కరుగా మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల్లో దాదాపు 40 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో 10న ఒకరు, 12న ఇద్దరు చనిపోవడంతో ఇష్యూ సీరియస్ అయ్యింది. దీన్ని డైవర్ట్ చేసే ప్లాన్ నడిచినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మృతులు కల్తీకల్లు తాగి చనిపోలేదని, డ్రీహైడేషన్ వల్ల చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అప్పటి ఓ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఇష్యూలో ఆఫీసర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారనే టాక్ వచ్చింది.
‘ఇలాంటి ఇష్యూస్ కూడా మేనేజ్ చేసుకోలేరా?’ అంటూ గరం అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డాక్టర్లతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారంతా కల్తీకల్లు తాగడం వల్ల అడ్మిట్ కాలేదని, ఎండలకు తిరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని ప్రకటన ఇప్పించినట్లు విమర్శలొచ్చాయి. అదే రోజు ఎక్సైజ్, పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి జిల్లాలో కల్తీకల్లు బాధితులు లేరని, హాస్పిటల్లో ఉన్న వారంతా డీహైడ్రేషన్‌కు గురైన వారని పేర్కొన్నారు. జిల్లాలో స్వచ్ఛమైన కల్లు మాత్రమే దొరుకుతుందని అప్పట్లో ప్రకటన ఇప్పించడం గమనార్హం.
కర్నాటక నుంచి దిగుమతి..
మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి కర్నాటకకు చెందిన ఓ మీడియేటర్ ద్వారా మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కల్లు వ్యాపారులు పెద్ద మొత్తంలో అల్ర్పాజోలంను దిగుమతి చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. రాయచూర్ ప్రాంతం నుంచి కారులో పాలమూరుకు రవాణా అవుతున్నట్లు తెలిసింది. ఈ కారు పాలమూరుకు చేరుకున్నాక ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఏరియాలకు ఏజెంట్ల ద్వారా సప్లై జరుగుతోందనేది బహిరంగ రహస్యం. కారు వచ్చే మార్గంలో టై రోడ్ వద్ద ఎక్సైజ్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ల చెక్ పోస్టులున్నా, ఆ వెహికల్‌ను అడ్డుకోవడం లేదనే విమర్శలున్నాయి.