తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కేబినెట్‌‌ భేటీ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్‌‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు అనధికారికంగా సమాచారం ఇచ్చారు. కేసీఆర్ వైరల్ ఫీవర్‌‌‌‌తో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేబినెట్ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తిరిగి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్​ను నామినేట్ చేస్తూ ఆమోదం కోసం పంపగా, సోషల్ సర్వీస్ కేటగిరీలో వారిద్దరు ఫిట్ కారని పేర్కొంటూ గవర్నర్ తమిళిసై ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో వాళ్లిద్దరి పేర్లను మళ్లీ కేబినెట్ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది. అలాగే, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.