- ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం
- కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ
- నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అక్తర్ కమిషన్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శాసనసభ సెక్రటరీ నర్సింహాచార్యులు ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీ హాల్లోనే మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికను ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళిక విభాగం సమర్పించింది.
ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి సోమవారం అందజేయనుంది. ఈ రెండింటిపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.