- మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం
- కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలిపే చాన్స్
- రైతు భరోసా విధివిధానాలపై చర్చించనున్న కేబినెట్
హైదరాబాద్, వెలుగు:ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదాకు ఆమోదముద్ర వేయనున్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురావడానికి ఆమోదం తెలుపుతారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ లో పలు సవరణలు ప్రతిపాదిస్తారని సమాచారం.
గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ ఉద్యోగాల్లో వీఆర్వో, వీఆర్‌ఏలతో సగం, మిగతా సగం ఉద్యోగాలు కొత్త వారితో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేయనున్నారు. నవంబర్ మొదటి వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో.. అసెంబ్లీ సమావేశాల తేదీలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. రైతు భరోసా విధి, విధానాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరుతో రైతన్నలకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు రైతుభరోసా గైడ్‌లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా గైడ్‌లైన్స్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ నివేదికపై చర్చించి.. రాష్ట్రవ్యాప్తంగా అమలుపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.