తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, నిర్వహించడంతోపాటు అనేకమంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాలతో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 1997లో జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించేవారు.
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి తీర్మానం చేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వరంగల్ డిక్లరేషన్ ఇచ్చింది. 2000 సంవత్సరం నుంచే తెలంగాణ సమాజంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మొదలైంది. కవులు, రచయితలు, మేధావులలో అంతటా భావజాల ప్రచారం మొదలైంది.
ఆత్మగౌరవ పరిపాలనకు పోరాటం
మా నీళ్లు మాకు, మా నిధులు మాకు , మా ఉద్యోగాలు మాకు అనే నినాదంతో ఉద్యమం ముందుకు వచ్చింది. ఆత్మగౌరవ పరిపాలన, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడానికి ముందుకు వచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి సీపీఐ జాతీయ స్థాయిలో చర్చించి రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించాలని జాతీయ మహాసభలో తీర్మానం చేసింది. రాష్ట్ర ఆవశ్యకత గురించి, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై, అవమానాలపై ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ, కోదండరామ్, ప్రజా యుద్ధనౌక గద్దర్, కేసీఆర్ తో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ, రాష్ట్ర నాయకత్వం సుస్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా వివరించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఒక్క టీఆర్ఎస్ తోనే రాష్ట్ర సాధన సాధ్యం కాదనే ముందు చూపుతో ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్ గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) ఏర్పడింది. అందులో అనేక రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. సీపీఐ జేఏసీలో లేకపోయినప్పటికీ ప్రతి ఉద్యమంలో భాగస్వామ్యం అయింది.
ఉద్యమానికి సోనియాగాంధీ అండ
ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు అనేక ప్రజాసంఘాల నాయకులు ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. 2004-– 2009 మధ్య కాలంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు యూపీఏలో భాగస్వామ్యం అయిన సీపీఐ, టీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలను, విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాలను జాతీయస్థాయిలో వివరించడం జరిగింది. దీనికి తోడు తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ వారికి అండగా నిలిచి 2009 డిసెంబర్ 9న రాష్ట్ర అవిర్భావాన్ని ప్రకటించగా ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటనను పెండింగ్ పెట్టింది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి ఆ ప్రకటనే ప్రధాన కారణమైంది. సోనియాగాంధీ నిర్ణయం మేరకు 2014 జూన్ 2న అటు పార్లమెంటులో, ఇటు రాజ్యసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందగలిగింది.
తెలంగాణపై మోదీ సర్కారు చిన్నచూపు
గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఏ ఒక్కటి కూడా అమలుచేయలేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోపాటు పదేండ్లుగా రాష్ట్రంలో పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆశయాలు తీర్చలేకపోయింది. ముఖ్యంగా కేసీఆర్ అహంకార పూరిత ప్రజా వ్యతిరేక వైఖరి, కుటుంబ ప్రమేయ పాలన ప్రజలందరికీ అభ్యంతరకరమైంది. గడిచిన ఎన్నికల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉత్సాహవంతుడైన రేవంత్ రెడ్డి అన్నివర్గాలను కలుపుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. ప్రజాపాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు నిత్యం ప్రజలను, ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను కలవాలి. వారి నుండి వచ్చే వినతులు స్వీకరించి, పరిశీలించి పరిష్కరించాలి.
కేసీఆర్ పాలనలో పరాకాష్టకు అవినీతి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు గత పాలకులు మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కొంత ముందుకు వచ్చినా ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అంచనాలకు మించి ప్రాజెక్టుల సామర్థ్యం పెంచడం, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోపాటు అవినీతి పరాకాష్టకు చేరింది. రైతుల ఆశలు ఆడియాశలు అయ్యాయి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి కేసీఆర్ ప్రభుత్వం నెట్టింది. ఎన్నో ఏండ్లుగా రైతుల భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే చేయలేదు. ధరణి పోర్టల్ లో అనేక లొసుగులు ఉన్నాయి. ప్రజల మౌలిక సదుపాయాలైన కూడు, గుడ్డ, నీడ కల్పించలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించక పోవడం, ఉపాధి అవకాశాలు చూపకపోవడంతో పదేండ్ల కాలంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.
చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు