ఢిల్లీ పెద్దలేమంటారో

ఢిల్లీ పెద్దలేమంటారో

నీట ముంచినా, పాల ముంచినా భారం నీదే, బాధ్యతా నీదే!’ అన్నట్టు ఢిల్లీ వైపు చూస్తోంది తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ! రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ వ్యవహారాలు ఇప్పుడు పూర్తిగా అధిష్టానం చేతుల్లోకి వెళ్లిపోయాయి. వారి నిర్వహణలో లేనిదెప్పుడు? అనే ప్రశ్న సహజంగానే తలెత్తొచ్చు! కానీ, ఇన్నాళ్ల నిర్వహణ వేరు, తాజా పరిస్థితులు వేరు. ‘ఏ రాష్ట్ర పరిస్థితినైనా ఇప్పుడు మేమే నిర్వహించగలం, చక్కదిద్దగలం’ అనే ఆత్మస్థైర్య స్థితికి చేరింది ఢిల్లీ అధిష్టానం. కర్నాటక గెలుపు తర్వాత ఇది బ‌‌‌‌ల‌‌‌‌ప‌‌‌‌డింది. తెలంగాణ, అంత తేలిక వ్యవహారం కాదు. ఇక్కడ నెగ్గుకు రావడానికి ఈ సారి కాంగ్రెస్‌‌‌‌ వ్యూహాలు-ఎత్తుగడలు ఎలా ఉంటాయోనని జనం, రాజకీయ వర్గాలు, రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ శ్రేణులు కూడా ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తూ నిరీక్షిస్తున్నాయి.

నిన్నటి దాకా బీజేపీ శిబిరంలో సందడి చేసి, మరుగుపడుతున్న ‘చేరికలు’ అనే మాట ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌ శిబిరం వైపు మళ్లింది. సంప్రదింపుల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్ర నాయకత్వం పాత్రను తగ్గించి కాంగ్రెస్‌‌‌‌ ఢిల్లీ నాయకత్వమే స్వయంగా ఈ వ్యవహారం చూస్తున్నట్టుంది. పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారితో అదిష్టానమే మాట్లాడుతోంది. టీపీసీసీ నేతకు కబురైనా లేకుండానే, మేడ్చల్‌‌‌‌(మల్కాజిగిరి లోక్‌‌‌‌సభ స్థానం పరిధి)కి చెందిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్‌‌‌‌)ని నేరుగా అధిష్టానమే పార్టీలో చేర్చుకోవడం ఒక సంకేతం మాత్రమే! ఢిల్లీ చొరవ పెరిగేసరికి, ‘

ఇది టీపీసీసీ నేత పెత్తనానికి కత్తెరే కదా!’ అన్నట్టు పార్టీలో సోకాల్డ్‌‌‌‌ ‘సీనియర్‌‌‌‌ నాయకులు’ కాస్త ఊరట చెందినట్టు, అణకువతో ఉన్నట్టు కనిపిస్తున్నా... ఇది అంత తేలిగ్గా నమ్మటానికి లేదు. పార్టీ రాష్ట్ర విభాగంలోని ముఖ్యనాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం ఢిల్లీ నాయకత్వానికి ఇప్పుడే కాదు, ఎప్పటికీ సవాలే! కర్నాటక అనుభవంతో... ఇక్కడ కూడా మొదట ‘ఐక్యత’పైనే అధినాయకత్వం దృష్టి నిలిపింది. అరడజను మంది వరకున్న ముఖ్య నాయకులు, తమ వ్యక్తిగత ‘ఈగో’లు వీడి కలిసివస్తారా? అన్నది అంత తేలిగ్గా సమాధానం లభించని ప్రశ్న! తెలంగాణ సీనియర్‌‌‌‌ నాయకులతో రాహుల్‌‌‌‌ గాంధీ చర్చించడానికి తేదీలు ఖరారై కూడా రెండు మార్లు వాయిదా పడ్డ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, వెంటనే జరగాల్సి ఉంది. రాబోయే అయిదారు మాసాలు ఎలా నడుచుకునేది? ఏయే అంశాల్ని చేపట్టేది? నిర్దిష్టంగా ఎన్నికల కోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లేది ఖరారు కావాల్సి ఉంది.

కర్నాటక తెలంగాణ మధ్య తేడా అదే!

కర్నాటక అసెంబ్లీ ఫలితాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ముస్లిం కారకం ఒకటి! జనతాదళ్‌‌‌‌(సెక్యులర్‌‌‌‌) బలహీనపడటం, ఒక వేళ హంగ్‌‌‌‌ వస్తే.. జేడీఎస్‌‌‌‌ కింగ్‌‌‌‌ మేకర్‌‌‌‌గా బీజేపీ వైపు కూడా వెళ్లవచ్చని జరిగిన ప్రచారం ముస్లింలను ఆలోచనల్లో పడవేసింది. పనిగట్టుకొని కాంగ్రెస్‌‌‌‌ కూడా ఈ ప్రచారం చేసి లబ్ధి పొందింది. ముస్లిం ఓటు జేడీఎస్‌‌‌‌ నుంచి కాంగ్రెస్‌‌‌‌ వైపు మళ్లింది. ‘హిందుత్వ’ భావనల కోసం బీజేపీ అక్కడ చేసిన అయిదేళ్ల ‘ప్రదర్శన వైఖరి’కావొచ్చు, నేరుగానే కాదు, దొడ్డిదారిన కూడా బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోవద్దని ముస్లింలు భావించడమైనా కావచ్చు.. 

వారు గంపగుత్తగా కాంగ్రెస్‌‌‌‌ వైపు మొగ్గారు. ఆ పరిస్థితి యథాతథంగా తెలంగాణలో ఉండదు. తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకులు కాంగ్రెస్‌‌‌‌కు చాన్నాళ్ల కిందే దూరమయ్యాయి. అందుకు వేర్వేరు కారణాలున్నా... కాంగ్రెస్‌‌‌‌- మజ్లీస్‌‌‌‌(ఎంఐఎం) మధ్య సయోధ్య చెడటం కూడా ప్రధానమే! ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు మజ్లీస్‌‌‌‌ అధినేత అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీతో వివాదం వచ్చింది. ఓ కేసులో ఒవైసీ అరెస్టు కూడా అయ్యారు. దరిమిలా కాంగ్రెస్‌‌‌‌తో ఆ పార్టీకి నెయ్యం చెడింది. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో మజ్లీస్‌‌‌‌ పార్టీ రాష్ట్రంలో పాలకపక్షమైన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌(నాటి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌)తో అంటకాగుతోంది. 

రేపటి ఎన్నికల్లోనూ అదే కొనసాగవచ్చు. అంతకు మించిన వ్యూహం కూడా ఉండొచ్చని కాంగ్రెస్‌‌‌‌ శంకిస్తోంది. అదేమంటే, ముస్లిం ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌‌‌‌ వైపు వెళ్లనీయకుండా చూడటం. ఏ కారణంగానైనా ‘వారి ఓట్లు ఈసారి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రావు’ అని, పాలకపక్షం సందేహించే పక్షంలో వారికున్న సాన్నిహిత్యం కొద్దీ, కనీసం ఓ పాతిక సీట్లలో పోటీ చేసేలా మజ్లీస్‌‌‌‌ను సన్నద్ధం చేయడం జరగొచ్చన్నది అనుమానం! దేశమంతా పోటీ చేసే మజ్లీస్‌‌‌‌, తెలంగాణలో మాత్రం ఎందుకు పోటీ చేయదు? పాతబస్తీకే ఎందుకు పరిమితమౌతుంది? అన్న వారి ప్రశ్నకు దీన్నొక సమాధానంగా మజ్లీస్‌‌‌‌ చెప్పుకోవచ్చు! అదే సమయంలో, ఇది తేలితే.. తాము ఆరోపిస్తున్నట్టు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌- బీజేపీ లింకులను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టగలమన్నది కాంగ్రెస్‌‌‌‌ ఆశ!

ఆ వర్గాలు చేరువయ్యేదెలా

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా లాభపడాల్సిన కాంగ్రెస్‌‌‌‌ బొక్కబోర్లా పడటానికి కారణమేంటి? రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఏ ఎన్నికలోనూ దానికి గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలతో పాటు బలమైన ‘ప్రభావక’ కులం రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్‌‌‌‌కు క్రమంగా దూరమైంది. ఆయా వర్గాలను మళ్లీ మచ్చిక చేసుకునే ఏ వ్యూహాలు, ఎత్తులతో కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వం ముందుకు వస్తుందన్నది ముఖ్యం. వేర్వేరు అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర తాయిలాలతో ఆయా సామాజిక వర్గాలను పాలకపక్షం ఆకట్టుకోగలిగింది.

 ఆయా వర్గాలను ఆకట్టుకునేలా ప్రకటించిన, అమలుపరచిన పథకాలు, కార్యక్రమాల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని నిత్యం విమర్శించే కాంగ్రెస్‌‌‌‌ ఆ మేరకు జనంలో విశ్వాసం కలిగించడం లేదు. తాము అధికారంలోకి వస్తే ‘ధరణి’ రద్దు చేస్తామంటున్న పార్టీ నాయకులు.. ధరణి ఏ విధంగా విఫలమైంది? ఎవరు బాధితులు? సగటు రైతు పరిస్థితి ఎలా చేయిదాటిపోయి, ధరణి ద్వారా భూమిపై పాలకుల గుత్తాధిపత్యం ఎలా కొనసాగుతోంది. ప్రజలకు వివరించడంలో విఫలమైంది. గిరిజనుల పోడు భూముల విషయంలో, దాదాపు 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్న సర్కారు, ఇప్పుడా సంఖ్యను నాలుగు లక్షలకు కుదించడాన్ని గట్టిగా నిలదీసిందీ లేదు.

 వేర్వేరు కారణాలతో పార్టీకి దూరమైన సామాజిక వర్గాలను మళ్లీ దగ్గరికి చేర్చుకునే నిర్దిష్ట వ్యూహం ఏంటి? అలాంటిదేమీ లేకుండా తెలంగాణలో నెగ్గుకురావడం కష్టం. మరోపక్క పాలకపక్షం చొరవతో సర్కారు.. పెన్షన్లను మరో రూ.500, రైతు బంధును ఇంకో వెయ్యి రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. వ్యక్తిగత పట్టు, పలుకుబడితో బలమైన అభ్యర్థులున్న చోట తప్ప సాధారణంగా పార్టీ పేరిట అభ్యర్థులు గెలిచిపోయే పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌కు ఎక్కడా లేదు.

నిజాయతీ  పరీక్షకు నిలవాల్సిందే

ఒక ప్రభుత్వాన్ని దించి, తమను గద్దెనెక్కించాలని ప్రజల్ని కోరుతున్నపుడు అందుకు తగిన భూమికను కాంగ్రెస్‌‌‌‌ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌‌‌‌ పార్టీని, గత అనుభవాల రీత్యా మరే ఇతర పార్టీలకన్నా ఎక్కువగా పరీక్షిస్తుంది తెలంగాణ సమాజం. ఉమ్మడి ఏపీలో, 2009లో కాంగ్రెస్‌‌‌‌ తిరిగి అధికారం నిలబెట్టుకున్నపుడు కూడా, తెలంగాణలో వారికి లభించింది 50 (119లో) సీట్లు మాత్రమే! ఇక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నామమాత్రపు సీట్లే

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌(ఒక్క వరంగల్‌‌‌‌ తప్ప) మూడు జిల్లాల్లో మొత్తం 32 స్థానాలకు గాను కాంగ్రెస్‌‌‌‌కు దక్కింది(2009) అయిదు సీట్లే! తర్వాత కూడా.... 2014లో 2, తర్వాత 2018లో 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కేంతగా బలహీనపడింది కాంగ్రెస్‌‌‌‌. ఆ శూన్యతలోకి బీజేపీ ఎదిగి మూడు పార్లమెంటు స్థానాల్నే చేజిక్కించుకుంది. అక్కడ కోలుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ను సంస్థాగతంగా, జనాభిప్రాయంలో బలోపేతం చేసే ఏయే చర్యలకు పార్టీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తుందోనన్న ఆసక్తి రాజకీయ క్షేత్రంలో నెలకొంది.

స్నేహ ‘హస్తం’ అందిస్తారో...

కిందటి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన అనుభవం బెడిసికొట్టింది. మరి, ఈసారి అలాంటి ప్రయోగాలేమైనా ఉన్నాయా? అన్నది తేలలేదు. విపక్ష ఓటు చీలొద్దంటే, కనీసం బీజేపీయేతర పక్షాలన్నా ఒకతాటిపైకి రావాలని కాంగ్రెస్‌‌‌‌లో కొందరు కోరుకుంటున్నారు. అందుకు, కొన్ని పార్టీలతో కలిసి సాగే ఆస్కారం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. బీఎస్పీతో కాంగ్రెస్‌‌‌‌ పొత్తుకు ఆస్కారం ఉందన్నది మొదటి అంశం. కమ్యూనిస్టులు ఎలాగూ పాలకపక్షం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో ఉన్నారు. తమకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో ‘మునుగోడు’ ఉప ఎన్నికలో కుదిరిన సయోధ్య కొనసాగుతోందంటున్నారు. 

ఇక కోందడరామ్‌‌‌‌ నేతృత్వంలోని టీజేఎస్‌‌‌‌, షర్మిల నేతృత్వపు వైఎస్సార్‌‌‌‌టీపీలతో కాంగ్రెస్‌‌‌‌ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయన్నది మరో ప్రచారం. కర్నాటక ఉప ముఖ్యమంత్రి, డైనమిక్‌‌‌‌ లీడర్‌‌‌‌గా పేరున్న డీకే శివకుమార్‌‌‌‌ మాధ్యమంగా షర్మిలతో సంప్రదింపుల పర్వం సాగుతున్నట్టు పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఆమెను పార్టీ నీడకు తేవడం ద్వారా తెలంగాణలో వైఎస్సార్‌‌‌‌ అభిమానుల్ని తిరిగి పార్టీ గొడుగు కిందకు తెచ్చినట్టవుతుందనేది కొందరి ఆశ! తెలంగాణలో ఆమె పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంటో, ప్రచార సారథ్యమో కోరవచ్చనేది మతలబు. 

పార్టీలో చేరి ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి పనిచేయవచ్చేమో కానీ, పదవులు కట్టబెడితే, తెలంగాణ మనోభావాల అంశం మళ్లీ తెరపైకి వచ్చి, ‘బాబుతో పొత్తు’లా బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదన్నది కొందరు అన్వయం! 2018లో బాబుతో కాంగ్రెస్‌‌‌‌ కుదుర్చుకున్న పొత్తును, ఒక సర్వే ప్రకారం మెజారిటీ శాతం వ్యతిరేకించారు. ఫలితాల్లో అది ప్రతిబింబించింది.

- దిలీప్‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌,  పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ,