విశ్లేషణ: విద్యార్థి, నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగిద్దాం

చరిత్రలో అక్టోబర్ 2వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  శాంతి-అహింసలే ఆయుధాలుగా పోరాడి భారతీయులకు స్వేచ్ఛా ఊపిరిలూదిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈ రోజు. మహాత్ముని పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ‘విద్యార్థి-నిరుద్యోగ సైరన్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నీళ్లు-నిధులు-నియామకాలు అనే పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మితమైంది. తెలంగాణ సాధనలో విద్యార్థులు, నిరుద్యోగుల పాత్ర మరువలేనిది. కానీ, వాళ్ల రెక్కల కష్టంతో గద్దెనెక్కిన కేసీఆర్, ఇప్పుడు వారికి ద్రోహం చేస్తున్నారు.

కేసీఆర్ ఏడేండ్ల పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులే కీలకపాత్ర పోషించాం. చదువులను లెక్క చేయకుండా, భవిష్యత్ ఏంటో ఆలోచన లేకుండా రాష్ట్ర ఏర్పాటే శ్వాసగా పనిచేసాం. కేసీఆర్ పండ్ల రసం తాగి, దీక్ష విరమించి వెన్నుచూపిన క్షణం నుంచి మేమంతా ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని మా భుజాలపై వేసుకున్నం. కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చి ‘‘పండ్ల రసాలు కాదు.. మా రక్తం తాగుతున్నవ్’’ అని నినదించినం. ఉద్యమం విద్యార్థుల చేతికి వెళితే తన ఉనికికే ప్రమాదమని భావించిన కేసీఆర్, నిమ్స్ లో ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని తన దొంగ దీక్షను కొనసాగించారు. విద్యార్థుల పోరాటం, త్యాగాలను అర్థం చేసుకున్న సోనియాగాంధీ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒకే అన్నారు. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పేరుతో ఫాంహౌస్​కే పరిమితమైన రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఘనత వర్సిటీలకున్నది. 

యూనివర్సిటీని నిర్లక్ష్యం చేస్తున్నరు

ఎన్నో త్యాగాలు చేసిన యూనివర్సిటీలను, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో గొప్పగా అభివృద్ధి చేయాల్సింది. కానీ, కేసీఆర్ ఆ బాధ్యత మరిచి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నిధులకన్నా తక్కువ ఇస్తున్నారు. రిటైర్​ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టడంలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని 2014 ఎన్నికల సభలో ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్, గద్దెనెక్కగానే ఆ ఊసే ఎత్తలేదు. కేజీ-పీజీ దేవుడెరుగు, కాలేజీలకు ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు కూడా చెల్లించలేదు. కేసీఆర్ నుంచి బకాయిల విడుదల కోసం కాలేజీ యాజమాన్యాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వర్సిటీల పేరుతో టీఆర్ఎస్ నాయకులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే, రేషనలైజేషన్ పేరుతో పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తున్నారు.

మాయమాటలతో మోసం చేసిన్రు

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్  మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో లక్షా 60 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అంచనా. ఏడేండ్లలో రిటైరైన ఉద్యోగుల స్థానాలను కలిపితే ఈ సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. 2017 అక్టోబర్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో లక్షా 12 వేల ఖాళీలున్నాయని ప్రకటించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా 90 వేల ఖాళీలున్నాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖాళీల సంఖ్యను తక్కువ చేసి చూపుతోంది. ఇప్పటికీ ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలు కాలేదు. ఏడేండ్లలో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అంతే కాకుండా ఇప్పటివరకు డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులకు నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎక్కడా కూడా రెగ్యులర్ డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు లేరు. మూడు సంవత్సరాలుగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం, 6 నెలలకు ఒకసారి చొప్పున ప్రతీ సంవత్సరం రెండు టెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈ ఒక్క ఉదాహరణ చాలు కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితి అర్థం చేసుకోవడానికి.

రెగ్యులరైజ్​ చేస్తమని మరిచిపోయిన్రు

గ్రూప్-1 రాత పరీక్షలు మాత్రమే నిర్వహించారు. మిగతా ప్రక్రియను మాత్రం మరిచిపోయారు. ఏడేండ్లలో ఒక్కసారి 8,972 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన విషయమై కోర్టులో అడ్డంకి ఎదురైంది. 2020లో గ్రూప్-2కు సంబంధించి 900 ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. గ్రూపు 2లోని నాన్-ఎగ్జిక్యూటివ్​ పోస్టులను గ్రూప్-3 కింద పరిగణించి ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి గాలికి వదిలేశారు. వైద్య శాఖలో సరైన నియామకాలు చేపట్టక కరోనా సమయంలో డొల్లతనం బయట పడింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్ నియామకాల్లో అన్ని అర్హతలున్న అదే కాలేజీలలో ఏండ్లుగా పనిచేస్తున్న లెక్చరర్లను కాదని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కేసీఆర్ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, 15 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల జాడే లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు అనే పదం వినబడదని కేసీఆర్​ ఉద్యమ సమయంలో చెప్పారు. అందర్నీ రెగ్యులరైజ్ చేస్తారని అంతా ఆశించారు. కానీ, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ.43 వేల జీతాన్ని ఇస్తుండగా, అదే ఉద్యోగాన్ని గెస్ట్ లెక్చరర్ అనే పేరుకు మార్చి నియామకాలు చేపడుతూ జీతాన్ని రూ.18 వేలకు  తగ్గించారు. ఇది కేసీఆర్ మాటల్లో అసలు మతలబు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్​ వైఫల్యం కాదా?

కేసీఆర్ ఇంట్లో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు తలా ఓ కుర్చీ దొరికింది. మరీ, ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ ఊరిస్తే, గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న పేద ప్రజల పిల్లలకు ఏం ఒరిగింది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగకపోతే అది కేసీఆర్ వైఫల్యం కాదా? తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా కొట్లాడిన విద్యార్థులే నేటి నిరుద్యోగులు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే కేసీఆర్ పూర్తిగా మరిచిపోయిన ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఊదుతున్నదే ఈ విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్. తక్షణమే ఖాళీలను నోటిఫై చేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే డిమాండ్​తో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరుద్యోగుల కోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 67 రోజుల పాటు నిర్విరామంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

రాష్ట్రంలో నిరుద్యోగం 21.88%

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం తెలంగాణలో నిరుద్యోగం 21.88%. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. పీజీలు, పీహెచ్ డీలు చేసిన వారు కూడా హోంగార్డు ఉద్యోగాలకు అప్లై చేసిన సందర్భాలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల హామీల్లో రూ.3,116 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి సగం పదవీ కాలం పూర్తయినా ఆ ఊసే ఎత్తడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డిని కొందరు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఏవని ప్రశ్నించగా, యువతకు హమాలి పనికి మించిన ప్రత్యామ్నాయ ఉపాధి ఏమున్నదని సెలవిచ్చారు. కనీసం డిగ్రీ కూడా లేనివారు కేబినెట్ మంత్రులు కావచ్చు, కానీ పీజీలు చదివిన వారు హమాలి పనికి పోవాలా? ఏనాడూ జై తెలంగాణ అనని వ్యక్తులు కేబినెట్ లో మంత్రులుగా ఉంటే, పోరాడిన విద్యార్థులు రోడ్ల పాలయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, ఎన్నికల ముగిసిన వెంటనే 50 వేల నియామకాలు చేపడతామని మాయమాటలు చెప్పి దాట వేస్తున్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగుల్లో 60% మందికి 2021 నాటికి వయోపరిమితి దాటిపోయింది.

- కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యుడు