ఆర్మూర్, వెలుగు: విద్యార్థుల్లో అభ్యాసనా సామర్థ్యాలు పెంపొందిస్తూ, గుణాత్మక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి టీచర్లకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులైన చిట్ల ప్రమీల–జీవన్ రాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ లో విద్యాస్ఫూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ స్కూళ్లల్లో పనిచేసే 140 మంది టీచర్లకు ఎస్సీఈఆర్ టీ నిపుణులతో బోధనా సామర్థ్యాల పెంపుపై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన ఉండాలన్నారు. పిల్లల్లో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడమే విద్య ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
పేద, మధ్య తరగతి పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యానందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికితేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించాలన్నారు. ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, డీఈవో దుర్గాప్రసాద్, డీఐఈఓ రఘురాజ్, డీపీవో జయసుధ, ఎస్సీఈఆర్టీ రిసోర్స్ పర్సన్లు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ చారి, రాజేందర్ కుమార్, ట్రస్ట్ కార్యదర్శి ఎన్.నర్సింలు, ఎంఈవో పింజ రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.