అక్టోబర్ 28 నుంచి టీఎస్​సెట్

హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ 28 శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్​ సెట్–2023) ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో ఆన్​లైన్​లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీఎస్ సెట్ కు మొత్తం 40,838 మంది అటెండ్ కానున్నారు. ఇందులో అబ్బాయిలు 18,091 మంది ఉండగా, అమ్మాయిలు 22,746 మంది, ట్రాన్స్ జెండర్​ ఒకరున్నారు. కాగా, ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీఎస్​ సెట్ మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ తెలిపారు. 

తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో, ఏపీలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే హాల్ టికెట్లు వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు డౌన్​లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కొందరు కోరినా, ఈ పరీక్ష వల్ల ఇతర  ఏ ఎగ్జామ్స్ కు ఇబ్బంది లేకపోవడంతో కంటిన్యూ చేస్తున్నట్టు చెప్పారు. నవంబర్ లాస్ట్ వీక్​లో ఫలితాలు రిలీజ్ చేస్తామని మురళీకృష్ణ వెల్లడించారు.