భద్రాచలం, వెలుగు : ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కొత్త కమిటీని మంగళవారం దుమ్ముగూడెం మండలం గంగోలులో జరిగిన ద్వితీయ మహాసభలో ఎన్నుకున్నారు. మొత్తం 59 మందితో ఏర్పాటైన కొత్త కౌన్సిల్ సభ్యులు సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గౌరవ అధ్యక్షులుగా ఏపూరి బ్రహ్మం(ఇల్లెందు), సరెడ్డి పుల్లారెడ్డి(మణుగూరు), అధ్యక్షుడిగా చండ్ర నరేంద్రకుమార్( జూలూరుపాడు), ప్రధాన కార్యదర్శిగా ముత్యాల విశ్వనాథం(పాల్వంచ), కోశాధికారిగా పద్దం విజయలక్ష్మి(దమ్మపేట)ని ఎన్నుకున్నారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి వాటి పరిష్కారం ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను నిలదీస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతు బంధు పథకం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, పోడు భూములకు పట్టాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, రుణాలు, రుణమాఫీ కోసం దశలవారీగా ఉద్యమాలను నిర్వహిస్తామని ప్రకటించారు.