బోనమెత్తిన భాగ్యనగరం​.. నగరంలో ఘనంగా వేడుకలు

  • పాతబస్తీలో అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు 
  • లాల్ దర్వాజ సింహవాహిని ఆలయానికి పోటెత్తిన భక్తులు 
  • 20న గోల్కొండలో ముగియనున్న ఆషాఢమాస బోనాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో నగరమంతటా ఉత్సవాలు జరుపుకున్నారు. సిటీలోని ప్రముఖ ఆలయాలు సహా కాలనీలు, బస్తీల్లోని గుడులన్నీ భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దలిల్లాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న టెంపుల్, మీరాలంమండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని పురాతన దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లాల్​దర్వాజ ఆలయంలో ప్రత్యేకంగా క్యూలైన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజ సహా చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి, సబ్జి మండి మహంకాళి, అక్కన్న మాదన్న, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం లాల్ దర్వాజ అమ్మవారికి ముందుగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబసభ్యులు బోనం సమర్పించి పూజలు చేశారు. కాగా, ఈ నెల 20న గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి 9వ బోనం సమర్పించడంతో ఆషాడమాస ఉత్సవాలు ముగియనున్నాయి. 

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.. 

లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సినీ నటి వైష్ణవి, మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా, అమ్మవారికి  జోగిని శ్యామల వెండి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి నారా భువనేశ్వరి పంపించిన పట్టువస్త్రాలను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమర్పించారు.