
- రాష్ట్ర అవతరణ వేడుకల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్ల
నిజామాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా పోషించిన పాత్ర చరిత్రపుటల్లో నిలిచిపోతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ' నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ ప్రజాకవి దాశరథి గేయానికి ఇక్కడే అంకురార్పణ జరగడం జిల్లాకు అరుదైన ఖ్యాతి తెచ్చిందన్నారు. మలిదశ ఉద్యమంలో అత్మ బలిదానాలు త్యాగాలు వెలకట్టలేమన్నారు. అమరువీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతిబాటలో అందరం ముందుకు వెళ్తున్నామన్నారు.
ఆదివా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలో ఆయన ప్రసంగించారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమాన ప్రయారిటీ ఇస్తూ సంక్షేమం, అభివృద్ధి అమలు చేస్తున్నామన్నారు. విద్యకు టాప్ స్థానం ఇస్తూ 793 గవర్నమెంట్ బడుల్లో సౌలత్లు పెంచుతున్నామన్నారు. పది రిజల్టులో సర్కారు స్కూల్ పిల్లలు 103 మంది 10 జీపీఏ సాధించడం గర్వకారణమన్నారు. బడిబాట ప్రొగ్రాంతో విద్యార్థుల నమోదు శాతం పెంచే టార్గెట్ పెట్టుకున్నామన్నారు. పిల్లల యూనిఫారం కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించామన్నారు.
స్వయం సహాయ మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనివ్వడానికి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రైతులను దేశానికి రోల్‌మాడల్ చేయడానికి గవర్నమెంట్ వారికి అండదండగా ఉంటుందన్నారు. ఆర్థికంగా బలపర్చే కార్యక్రమాలు తీసుకుందన్నారు. రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి వ్యవసాయ నిపుణులతో అన్నదాతలు నేరుగా చర్చించే వీలు కల్పించామన్నారు. జిల్లాను సామాజికంగా, ఆర్థికంగా, కల్చరల్పరంగా, విద్యా, వైద్యం వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో పెట్టడానికి యంత్రాంగం చేస్తున్న కృషిలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.
జాతీయ జెండా ఎగరేసి అమరవీరుల స్తూపానికి ఆయన నివాళి అర్పించారు. పరేడ్ చేసిన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ, నగర పాలక కమిషనర్ మంద మకరంద్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి : తెలంగాణ రాష్ర్ట సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఆదివారం రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాలు, మున్సిపాలీటీల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఎస్పీ సింధూశర్మ, ట్రైనీ ఐపీఎస్ కాజల్‌సింగ్, అడిషనల్ కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తదితరులు నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.... అమరుల ఆశయాలు, ఆకాంక్షల సాధనలో రాష్ట్రం జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఆయా ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు, పార్టీ ఆఫీసులు, సంస్థల వద్ద జాతీయ జెండాను ప్రతినిధులు ఆవిష్కరించారు.