తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలవుతున్నది. కానీ, గత ప్రభుత్వం మనకు రాష్ట్ర గీతాన్ని నిర్దేశించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ గీతం ప్రజలని కర్తవ్యోన్ముఖులని చేసింది. ఉర్రూతలూగించింది. ఆ పాట వింటున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి గీతాన్ని రాసిన వ్యక్తి ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందిబోయి.. సంగీతకల్పన కీరవాణి చేస్తారా? అని విమర్శలు మొదలుపెట్టారు. ఈ వాదనలు చేస్తున్న వ్యక్తులు గత పది సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేదని ఒక్కసారి కూడా తమ గొంతుని ఎత్తలేదు.
యాదాద్రి దేవాలయానికి ఆంధ్రా వాస్తు శిల్పి ఆనందసాయిని నియమించుకున్నప్పుడు ఒక్కమాట కూడా అనలేదు. బతుకమ్మ పాటని మలయాళీ అయిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళుడైన ఏఆర్ రహమాన్ చేత సంగీత కల్పన చేయించినప్పుడూ తమ గొంతుని ఎత్తలేదు. ఇట్లా చెప్పుకుంటూపోతే చాలా విషయాలు చెప్పవచ్చు. అవి ప్రధాన విషయాలు కాదు. ప్రధానమైన విషయం రాష్ట్ర గీతం ఆవశ్యకత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయగీతంజనగణమన ఉండగా రాష్ట్రగీతం అవసరమా? అన్నది ప్రధానమైన అంశం. చాలా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో రాష్ట్ర గీతాలని ఏర్పరుచుకున్నాయి. అవి ప్రధానంగా కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒడిశా, గుజరాత్‌లు ఇవి కాకుండా చాలా రాష్ట్రాలు అనధికారికంగా రాష్ట్రగీతాలని ఆలపిస్తూనే ఉన్నారు.
జాతీయ గీతం రక్షణే రాష్ట్ర గీతానికి..
జాతీయగీతం ఆలపించినప్పుడు ఏవిధంగా ఉండాలన్న విషయం గురించి కూడా నడవడిక నియమాలు ఉన్నాయి. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు అందరూ లేని నిలబడాలి. సినిమాహాల్స్‌లో జాతీయ గీతాన్ని తప్పకుండా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు శ్యామ్ నారాయణ్ చౌక్సే కేసులో ఆదేశించింది. కానీ, ఆ తరువాత ఈ ఉత్తర్వులను మార్పుచేసి సినిమా హాల్ యజమానుల విచక్షణకి ఈ విషయాన్ని కోర్టు వదిలిపెట్టింది. రాష్ట్రాల గీతాల విషయం గురించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో చెప్పలేదు. కానీ, ఆ ఆర్టికల్సే రాష్ట్ర గీతానికీ వర్తిస్తుందని చెప్పవచ్చు.
రాష్ట్ర గీతం గౌరవం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని కూడా తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. జాతీయ గీతానికి సంబంధించిన ఆర్టికల్స్‌ని, పరిగణనలోకి తీసుకుని చట్టం తీసుకుని రావాలి. త్యాగమూర్తులని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గీతం ‘జయ జయహే తెలంగాణ’. ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించాల్సిందే. ‘జయ జయహే తెలంగాణ’ తెలంగాణ ఆర్తి గీతం, పోరాట గీతం. తెలంగాణ స్వప్నం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఒక ఉద్వేగం. పది సంవత్సరాలు తరువాత అయినా తెలంగాణ రాష్ట్ర గీతం వస్తున్నందుకు ప్రజలకు, మరీ ముఖ్యంగా అందెశ్రీకి అభినందనలు.
జాతీయ గీతానికి రాజ్యాంగ రక్షణ
దేశభక్తి భావనని ప్రకటించడానికి జాతీయ గీతం అవసరం. జాతీయ చిహ్నాల మాదిరిగా జాతీయ గీతం ప్రతి దేశానికి అవసరం. డిసెంబర్ 27, 1911వ సంవత్సరంలో ‘భారత భాగ్య విధాత’ పేరుతో విశ్వకవి రవీంద్రనాథ్ రాసిన గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలోని రెండో రోజున కలకత్తాలో ఆలపించారు. జనవరి 24, 1950వ సంవత్సరంలో రాజ్యాంగ అసెంబ్లీ ఈ గీతాన్ని మన దేశ గీతంగా ప్రకటించింది. భారతదేశ వారసత్వాన్ని ఈ గీతం ఉన్నత స్థాయిలో చూపిస్తున్నది. ఈ గీతాన్ని ఠాగూర్ బెంగాలీలో ‘భారత భాగ్య విధాత’గా రాశారు.
ఆ తరువాత ‘జనగణమన’గా మార్చారు. జాతీయ గీతానికి రాజ్యాంగం కొన్ని రక్షణలను ఏర్పాటు చేసింది. ప్రతి దేశ పౌరుడు రాజ్యాంగ విలువలును, ఆదర్శాలను, సంస్థలను గౌరవించాలి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ ప్రకారం ప్రతి భారత పౌరుడి విధి. జాతీయ గీతాన్ని అగౌరపరిచేవారు జాతీయ గౌరవానికి (అవమానాల) నివారణ చట్టం ప్రకారం మూడు సంవత్సరాల వరకు శిక్షను, జరిమానాను విధించడానికి అవకాశం ఉంది.
- మంగారి రాజేందర్ జిల్లా జడ్జి(రిటైర్డ్)