
- రాష్ట్రం ఇచ్చింది సోనియానే అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు: మహేశ్ కుమార్
- గాంధీ భవన్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
హైదరాబాద్, వెలుగు : సోనియాగాంధీ సహకారంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అసెంబ్లీ లో చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత చాలా సార్లు ఆమెను అవమానించారని ఫైర్ అయ్యారు. పదేండ్లలో తెలంగాణ ప్రజలకు పాలన దూరమైందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించారని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు, యువకులు ప్రాణాలను త్యాగం చేయడంతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి గిఫ్ట్ ఇచ్చారని అన్నారు. ఈ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితమేనని, అందుకే తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని చేరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరీ, మాజీ మంత్రి గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.