సింగరేణి భవన్​లో ఆవిర్భావ వేడుకలు

సింగరేణి భవన్​లో ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో తన వంతు బాధ్యతను సింగరేణి  సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ కోల్ మూమెంట్  డాక్టర్ జె.ఆల్విన్  అన్నారు. ఆదివారంహైదరాబాద్  సింగరేణి భవన్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్   అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా నాలుగు బొగ్గు బ్లాకులను చేపట్టబోతున్నామని, ఈ ఏడాది నాలుగు కొత్త గనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుత 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్​కు అదనంగా మరో 800 మెగావాట్ల సూపర్  క్రిటికల్  థర్మల్  ప్లాంట్​ నిర్మించనున్నామని చెప్పారు. సోలార్  ప్లాంట్లను విస్తరిస్తూ 2,000 మెగావాట్ల సోలార్​ పవర్​ జనరేషన్​ ప్లాంట్లు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. వ్యాపార విస్తరణ చర్యలు విస్తృతంగా చేపట్టబోతున్నామని, ఈ చర్యలతో సింగరేణి సంస్థకు పటిష్టమైన ఆర్థిక పునాది కల్పించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికీ తోడ్పాటు అందిస్తామని ఆల్విన్  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ జీఎం దేవేందర్, ఏజీఎంలు ఎన్వీ రాజశేఖర్ రావు,చక్రవర్తి, చీఫ్  ఆఫ్  పవర్ విశ్వనాథరాజు, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉత్తమ అధికారిగా ఎంపికైన మహేందర్ రెడ్డి, మణి ఇలంగోలను ఈ సందర్భంగా సత్కరించారు.