- పెట్టుబడుల కింద మరో రూ.31,221 కోట్ల ఖర్చు: అశ్వినీ వైష్ణవ్
- రైల్వేల అభివృద్ధికి మూడు ఎకనామిక్ కారిడార్లు : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్ ల అభివృద్ధికి రూ.5,071 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ప్రాజెక్ట్ ల కింద 2,338 కి.మీల కొత్త ట్రాక్ ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం కేంద్రం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.31,221 కోట్లను పెట్టుబడుల రూపంలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గురువారం ఢిల్లీలోని రైల్వే భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ.886 కోట్లు కేటాయించిందని చెప్పారు.
కానీ తమ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లోనే తెలంగాణ రాష్ట్రానికి రూ.5,071 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 17 కి.మీ రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. ప్రస్తుతం 142 కి.మీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ట్రాక్ నిర్మాణంలో 8.5 శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో 100 శాతం రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పూర్తయినట్లు చెప్పారు. అమృత్ స్టేషన్స్ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను మోడ్రనైజ్ చేసినట్లు తెలిపారు. పదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 414 ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు, 40 ఎఫ్ఓబీలు, 53 లిఫ్ట్ లు, 27 ఎస్కలేటర్లలను నిర్మించినట్లు పేర్కొన్నారు. 33 స్టేషన్ల లో 45 వన్ స్టేషన్ – వన్ ప్రొడెక్ట్ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించాం..
కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఇండస్ట్రీని ప్రధాని మోదీ ప్రారంభించారని, పనులు మొదలయ్యాయని వైష్ణవ్ చెప్పారు. తాజా బడ్జెట్లో కేటాయించిన నిధులే రాష్ట్రం రైల్వేల అభివృద్ధికి మోదీ సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం అన్నారు. వారానికి ఒక వందే భారత్ ట్రైన్ తయారు చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. డిమాండ్ ను బట్టి ఆయా రాష్ట్రాల్లో వందే భారత్‌ల సంఖ్యను పెంచుతామని చెప్పారు.
కారిడార్లతో సేవల్లో వేగం: నిర్మలా సీతారామన్
మూడు రకాల ఎకనామిక్ కారిడార్ల ద్వారా రైల్వేలను మరింత వేగంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన 2024-–25 మధ్యంతర బడ్జెట్లో పేర్కొంది. అలాగే 40 వేల జనరల్రైల్వే బోగీలను ‘వందే భారత్’ స్థాయికి మార్చనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కారిడార్‌లను రూపొందించడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని, ప్యాసింజర్ రైళ్ల యాక్టివిటీలు మెరుగుపడతాయని ఆమె అన్నారు. ప్రయాణీకుల భద్రత, ఫెసిలిటీలు పెరుగుతాయన్నారు. అలాగే రైల్వే లాజిస్టిక్ సేవల కెపాసిటీని పెంచడంతోపాటు ఖర్చును తగ్గిస్తాయని వివరించారు.
ఈ మూడు ఎకనామిక్ కారిడార్లను.. ఎనర్జీ, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, -ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లుగా విభజించినట్లు పేర్కొన్నారు. మల్టీ-మోడల్ కనెక్టివిటీని పెంచడం కోసం పీఎం గతి శక్తి కింద వీటిని ఎంపిక చేసినట్లు చెప్పారు.