తెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు.. త్వరలో కాజీపేట మల్టిపుల్​ రైల్వే

తెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు.. త్వరలో కాజీపేట మల్టిపుల్​ రైల్వే
  • మ్యానుఫాక్చరింగ్​ యూనిట్​ ప్రారంభం
  • బడ్జెట్​వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్​ఫర్ ఎక్స్లెన్స్
  • 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని వెల్లడి

న్యూఢిల్లీ/ హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్రం ప్రవేశ పెట్టిన 2025–-26 బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 5, 337 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. అతి త్వరలో కాజీపేట్లో మల్టిపుల్ రైల్వే మ్యానుఫాక్చరింగ్​యూనిట్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ (ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి) కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. దాంతో  పోల్చితే ప్రస్తుతం తెలంగాణకు బడ్జెట్లో ఆరు రెట్లు అధికంగా కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే కేటాయింపులను న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం​వర్చువల్గా వెల్లడించారు.

సికింద్రాబాద్ ​రైల్​నిలయంలో స్క్రీన్ ​ఏర్పాటు చేసి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్​, సీనియర్​రైల్వే అధికారులు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్  మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో 22 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 39, 300 కోట్లతో 2, 529 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్స్​ పనులు పురోగతిలో ఉన్నట్టు వెల్లడించారు. కాజీపేట్​ప్రొడక్షన్ యూనిట్ అప్ గ్రేడింగ్ ను కలుపుకొని.. తెలంగాణలో మొత్తం ఇన్వెస్ట్ మెంట్ రూ.41.677 గా ఉందన్నారు. అలాగే, 2014 నుంచి తెలంగాణలో 753 కిలో మీటర్ల కొత్త రైల్వే ట్రాక్ ల నిర్మాణం పూర్తి చేశామన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 17 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. ప్రస్తుతం 68 కిలో మీటర్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఈ ట్రాక్ నిర్మాణంలో 4 రెట్ల వృద్ధి కనిపిస్తున్నదని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో 1,096 కిలో మీటర్ల పొడవున్న రైల్వే ట్రాక్ 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్నట్టు చెప్పారు. అమృత్ స్టేషన్స్ స్కీం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. గత పదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 453 ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లను పూర్తి చేశామని చెప్పారు. పలు స్టేషన్ల లో 62 లిఫ్ట్ లు, 17 ఎస్కలేటర్ల ఏర్పాటుతోపాటు 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించామని వివరించారు.  

రూ.1,042 కోట్లతో స్టేషన్ల అభివృద్ధి
తెలంగాణలో ప్రధానమైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కోసం రూ. 1, 042 కోట్లను మంజూరు చేసినట్టు అశ్వినీ వైష్ణవ్​ చెప్పారు. ఇందులో సికింద్రాబాద్ స్టేషన్ కు రూ. 715 కోట్లు, హైదరాబాద్ స్టేషన్ కు రూ. 327 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ పనులు ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడస్తున్నాయని, 9 ప్రత్యేకమైన స్టాప్లలో ఈ ట్రైన్లకు హాల్టింగ్ ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 నమో భారత్, 100 అమృత్ భారత్, 200 వందే భారత్ రైళ్లకు కేంద్ర బడ్జెట్ లో ఆమోదం తెలిపామని చెప్పారు. తక్కువ దూరం ఉన్న రెండు సిటీల మధ్య నమో భారత్ ట్రైన్లు నడుస్తాయని వెల్లడించారు.

సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్​ ఫర్​ ఎక్స్​లెన్స్​
తెలంగాణలో 1,326 కిలో మీటర్ల కవచ్ ను మంజూరు చేసినట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో 1, 011 కిలో మీటర్ల పనులు ప్రోగ్రెస్ లో ఉన్నట్టు చెప్పారు. మరో 623 కిలో మీటర్ల కవచ్ వ్యవస్థను అందుబాటులోకి  తెచ్చామన్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్​ ఫర్​ ఎక్స్​లెన్స్​ను ఏర్పాటు చేస్తామని అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇలాంటి వ్యవస్థను వాడుతున్నాయని తెలిపారు. రాబోయే ఆరేండ్లలో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.