రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ బేఖాతర్ : ఇన్ఫర్మేషన్ దాస్తున్నరు!

రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ బేఖాతర్ : ఇన్ఫర్మేషన్ దాస్తున్నరు!

ఏ సమాచారం అడిగినా సాకులు చెప్పి పక్కన పడేస్తున్నరు 
మండలాల నుంచి సెక్రటేరియట్ దాకా ఇదే తీరు
రాష్ట్రంలో 20 వేలకు పైగా ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్
స్టేట్​ కమిషన్ ​దగ్గరే10 వేలకుపైగా అప్పీల్స్
30 రోజుల్లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ రెండేండ్లయినా వస్తలె

హైదరాబాద్‌,  వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. ఎలాంటి సమాచారం అడిగినా సర్కార్ దాచిపెడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు, ఖర్చు చేస్తున్న ఫండ్స్, జరుగుతున్న పనుల వివరాలు ఇవ్వాలంటూ ఎవరు అడిగినా..  రైట్ టు​ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) యాక్ట్ కింద అర్జీ పెట్టుకున్నా రిప్లై ఇవ్వడం లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల లిస్టులో ఎవరెవరిని ఎంపిక చేశారు? పంచాయతీల్లో ఏయే పనులకు నిధులను ఖర్చు చేశారు? ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు? అంటూ ఆర్టీఐ కింద అర్జీలు పెడితే.. వాటిని ఆఫీసర్లు పక్కన పడేస్తున్నారు.

మండలాల్లోని ఆఫీసుల నుంచి డైరెక్టరేట్లు, కమిషనరేట్లు, సెక్రటేరియట్ వరకూ ఇదే పరిస్థితి ఉంది. అన్ని చోట్లా ఆర్టీఐ అర్జీలను పూచికపుల్లల్లా తీసి పడేస్తున్నారు. చట్ట ప్రకారం30 రోజుల్లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ను మూడేళ్లు గడిచినా ఇవ్వడం లేదు. నెల రోజుల్లో ఇవ్వకుంటే పై అధికారికి అప్పీల్​ చేసుకోవాలన్న నిబంధనను సైతం సర్కారు అటకెక్కించిందని ఆర్టీఐ కార్యకర్తలు చెప్తున్నారు.

డేటా ఉన్నా ఇయ్యట్లే.. 

చాలా ఏళ్ల క్రితం నాటి ఫైళ్లు, సమాచారం మినహా కంప్యూటర్లు వచ్చాక ప్రభుత్వ శాఖల్లోని సమాచారమంతా సీడీలు, డీవీడీలు, హార్డ్​ డిస్క్ లలో రెడీగా ఉంటోంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ను నిమిషాల్లోనే ఇచ్చేయొచ్చు. కానీ ఏ చిన్న సమాచారం కోరుతూ అప్లికేషన్ ఇచ్చినా నెల దాటినా స్పందించడం లేదు. దీంతో ఆర్టీఐ కార్యకర్తలు అప్పీలేట్ అధికారి వద్దకు వెళ్తున్నారు. నెల దాటితే ఆ సమాచారాన్ని ఎన్ని పేజీలు, సీడీలైనా ఫ్రీగా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడంలేదు. దీంతో 2 నెలల తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడా ఆర్టీఐ అప్పీల్స్ పెండింగ్ లో పడుతున్నాయి. రెండేళ్లు అవుతున్నా అప్పీల్స్ విచారణకు రాని పరిస్థితి నెలకొంది.

కమిషనర్లు ఆరుగురే.. 

రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్ లో సమాచార కమిషన్ ను నియమించింది. అప్పటికే కమిషన్ లో 7 వేల అప్లికేషన్లు ఉన్నాయి. కమిషన్ లో చీఫ్​ఇన్ఫర్మేషన్ కమిషనర్ తో పాటు10 మంది కమిషనర్లను నియమించుకునే వెసులుబాటున్నా సర్కారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తో పాటు ఓ సమాచార కమిషనర్‌‌నే నియమించింది. 11 నెలల క్రితం మరో ఐదుగురు కమిషనర్లను నియమించింది. చీఫ్​ కమిషనర్​ టర్మ్ ముగియడంతో ప్రస్తుత సమాచార కమిషనర్ ​బుద్ధా మురళినే పదవిలో అదనంగా కొనసాగుతున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో 20 వేలకుపైగా ఆర్టీఐ అప్లికేషన్లు, స్టేట్​ఇన్ఫర్మేషన్​కమిషన్ దగ్గరే10 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ లో పడ్డాయి.

ఆర్టీఐ యాక్ట్ ను ఖాతర్ చేస్తలే  

ఆర్టీఐ చట్టాన్ని ప్రభుత్వ అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. యాక్ట్ ప్రకారం30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే ఆ అధికారికి రాష్ట్ర సమాచార కమిషనర్​ రూ.250 నుంచి రూ.25 వేల వరకు ఫైన్​ వేయడంతోపాటు సస్పెండ్ కూడా చేయొచ్చు. ఉమ్మడి ఏపీలో ఇలాంటి అధికారులకు రూ.25 వేలు ఫైన్, షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు ఇలాంటి ఫైన్లు ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ఈ భయంతోనే ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం కమిషనర్లు ఫైన్లు వేయకపోవడం, చర్యలకు సిఫార్సు చేయకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

పెనాల్టీలు వేస్తలే  

దేశంలోని సమాచార కమిషనర్ల పనితీరుపై సటార్క్ నాగరిక్​ సంఘటన్​(ఎస్ఎన్ఎస్), సెంటర్​ఫర్ ఈక్విటీ స్టడీస్​(సెస్) సంయుక్తంగా ఇటీవల రిపోర్టును రిలీజ్ చేశాయి. రాష్ట్రంలో మార్చి31, 2019 వరకు స్టేట్ ఇన్ఫర్మేషన్​ కమిషన్ ​వద్ద 8,829 అప్పీళ్లు పెండింగ్ లో ఉండగా జూలై 31, 2020 నాటికి వాటి సంఖ్య 9,795కు చేరినట్లు నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 2019 నుంచి జులై 2020 మధ్య15 నెలల కాలంలో 6,372 ఫిర్యాదులనే పరిష్కరించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఒక అప్పీల్ విచారణకు రావడానికి సగటున రెండేళ్లకుపైగా టైం పడుతోందంది. ఇతర రాష్ట్రాల సమాచార కమిషనర్లు వార్షిక నివేదికలు ప్రకటిస్తుండగా రాష్ట్రంలో ప్రకటించడం లేదని, సమాచారం ఇవ్వని అధికారులకు పెనాల్టీలు వేయడం లేదని కూడా తేలింది.

అడిగిందొకటి..ఇచ్చింది మరొకటి.. 

రాష్ట్రంలోని తెలుగు, ఇంగ్లిష్​ న్యూస్ పేపర్లకు సమాచార, పౌర సంబంధాల శాఖ  ద్వారా ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టయిజ్​మెంట్లు, విడుదల చేసిన నిధుల ఇన్ఫర్మేషన్‌‌ ఇవ్వాలని ఐ అండ్ పీఆర్​ కమిషనర్​ఆఫీసులో ఆర్టీఐ కార్యకర్త రాజ్​కుమార్​ గతేడాది ఆగస్టు18న అప్లికేషన్‌ పెట్టుకున్నారు. నెల దాటినా సమాచారం రాకపోవడంతో సెప్టెంబర్ 23న ఫస్ట్ అప్పీలేట్ అధికారికి అప్లికేషన్ పెట్టారు. న్యూస్ పేపర్లకు అడ్వర్టయిజ్​మెంట్ల సమాచారం అడిగితే అప్పీలేట్ అధికారి చిన్నపత్రికలకు, మ్యాగజైన్లకు ఇచ్చిన యాడ్స్, నిధుల సమాచారం పంపారు. దీంతో రాజ్ కుమార్ డిసెంబర్11న స్టేట్ కమిషన్ లో అప్లికేషన్​ పెట్టారు. ప్రస్తుత కేసుల విచారణను బట్టి తన అప్లికేషన్​ విచారణకు రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని రాజ్ కుమార్ చెప్తున్నారు.

ఫైల్ నంబర్ చెప్తే సమాచారం ఇస్తరట.. 

మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారానికి చెందిన చెలమల్ల కిరణ్​ తమ గ్రామంలో ఎస్సారెస్సీ డీబీఎం 60 కింద భూములు కోల్పోయిన రైతులు, పరిహారం వివరాల కోసం గతేడాది నవంబర్ 16న తొర్రూర్​ ఆర్డీవో ఆఫీసులో ఆర్టీఐ చట్టం కింద అప్లై చేశారు. నెల రోజులు దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్డీవోకు అప్లికేషన్ అందించారు. దీంతో ఆయనకు ఆర్డీవో ఆఫీస్ ఉద్యోగి ఒకరు ఫోన్ చేశారు. ఫైల్ నెంబర్ చెప్తే సమాచారం ఇస్తామన్నారు. ఆర్డీవో ఆఫీసులోని ఫైల్ నంబర్ తనకెలా తెలుస్తుందంటూ కిరణ్ చివరకు స్టేట్ కమిషన్​లో అప్పీల్ చేసుకున్నారు.