అక్రమ మైనింగ్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. 20 శాతం పెనాల్టీ కడితే వెంటనే క్వారీ అన్ బ్లాక్

అక్రమ మైనింగ్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. 20 శాతం పెనాల్టీ కడితే  వెంటనే క్వారీ అన్ బ్లాక్
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • 20 శాతం ఫీజు చెల్లించిన వెంటనే క్వారీ అన్ బ్లాక్
  • 250 కంపెనీలకు డిమాండ్​ నోటీసులు పంపిన అధికారులు 
  • అక్రమ మైనింగ్​ పెనాల్టీలు రూ.3,500 కోట్లు ఉంటాయని అంచనా

 
హైదరాబాద్, వెలుగు: అక్రమ మైనింగ్​ పెనాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. వన్​టైం సెటిల్మెంట్​ (ఓటీఎస్) చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు అక్రమ మైనింగ్​ పెనాల్టీలకు ఓటీఎస్​ సౌకర్యం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవ పెనాల్టీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఇసుక, గ్రానైట్, క్రషర్లతో  పాటు ఇతర మైనింగ్​కు సంబంధించి ఎక్కడెక్కడ అక్రమాలు గుర్తించి నోటీసులు జారీ చేశారో.. వారందరికీ ఓటీఎస్​ కట్టేలా అవకాశం ఇచ్చింది.  ముందుగా మొత్తం పెనాల్టీలో 20% చెల్లించాలని, తర్వాత 4 వారాల్లో మిగతా మొత్తం చెల్లించాలని జీవోలో అధికారులు పేర్కొన్నారు.  20% పెనాల్టీ చెల్లించిన వెంటనే సదరు క్వారీ లేదా ఏజెన్సీని బ్లాక్​ లిస్ట్​లో నుంచి తీసేస్తామని తెలిపారు. ఏడాది మొత్తం పెనాల్టీలు చెల్లించుకునేలా ఓటీఎస్  ఆప్షన్​ ఉంది. 

దాదాపు 250 కంపెనీలకు పెనాల్టీలు వేసినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్​ వ్యవహారంలో ఐదుసార్లు పెనాల్టీ వేయాల్సి ఉంటే.. దానికి వన్​ ప్లస్​ వన్​ (సాధారణ సీనరేజి ఫీజు+ వన్ టైంసాధారణ సీనరేజి ఫీజు) వేసేలా మార్చారు. అంటే లక్ష రూపాయలకు సాధారణ ఫీజు ఉంటే.. దానికి ఐదుసార్లు పెనాల్టీ వేస్తే  రూ.ఆరు లక్షలు చెల్లించాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రెండు లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. అదే సమయంలో ఎక్కడైతే 10 టైమ్స్​ పెనాల్టీ ఉంటుందో.. అక్కడ టూ టైమ్స్​ కడితే సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంటే రూ.11 లక్షలు కట్టాల్సిన చోట రూ.3 లక్షలు కడితే సరిపోతుంది. ఇప్పుడు 250 కంపెనీలకే ఎలక్ట్రానిక్​ టోటల్​ స్టేషన్  సర్వే చేశారు. అయితే త్వరలోనే అన్ని రకాల క్వారీలకు పూర్తిగా ఈటీఎస్​ సర్వే చేసి.. అక్రమ మైనింగ్​కు పాల్పడినోళ్లందరికి డిమాండ్​ నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వసూలు చేయనున్నారు.  

ఎక్కువగా బీఆర్ఎస్​ లీడర్లవే

అక్రమ మైనింగ్​ పెనాల్టీలు దాదాపు రూ.3,500 కోట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వారు నివేదించినట్లు తెలిసింది. అయితే మైనింగ్​ పెనాల్టీలు ఎక్కువగా గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, లీడర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో వారంతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఓటీఎస్​కు ఒత్తిడి చేసి సక్సెస్​ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి అన్ని రకాలుగా సపోర్ట్​గా ఉంటామని కొంతమంది సర్కారు పెద్దలను సంప్రదించినట్లు సెక్రటేరియేట్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రూ.400 కోట్ల వరకే వచ్చే అవకాశం ఉంది. గత పాలకుల అండదండలతో అడ్డగోలుగా గ్రానైట్,  ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రూ.వేల కోట్లు ఖజానాకు గండి కొట్టారు. పదేండ్లలో రాష్ట్ర ఆదాయాన్ని మైనింగ్​ మాఫియా మింగేసింది. కొన్నిచోట్ల అనుమతులకు మించి తవ్వకాలు చేయగా.. ఇంకొన్నిచోట్ల అనుమతులు లేకున్నా యథేచ్చగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరిపినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆయా జిల్లాల్లో ఉన్న అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్లు తేలింది. రాష్ట్రంలో మొత్తం 2,154 మైనింగ్​ క్వారీలకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా గ్రానైట్,  క్రషింగ్, ఇసుక క్వారీ యూనిట్లు ఉన్నాయి.