డబుల్ బెడ్రూంతో పాటు రూ.25 వేలు : మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

డబుల్ బెడ్రూంతో పాటు రూ.25 వేలు : మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • సామగ్రి తరలింపు, ఇతర ఖర్చులకు నగదు పంపిణీకి నిర్ణయం
  • మూడు జిల్లాల్లో డబుల్​ ఇండ్ల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్స్​ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ/ గండిపేట్, వెలుగు: మూసీ రివర్ బెడ్​నిర్వాసితులకు డబుల్​ బెడ్రూం ఇంటితో పాటు సామగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం రూ.25 వేలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదట నిర్వాసితులకు డబుల్ ఇండ్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా ప్రతి కుటుంబానికి రూ.25 వేలు చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే అధికారులు మూసీ రివర్​ బెడ్​ పరిధిలో నిర్వాసితులను సమీప ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలించారు. ఖాళీ చేసిన ఇండ్లను మరెవరైనా ఆక్రమిస్తారనే కారణంతో మంగళవారం మలక్​పేట్ సెగ్మెంట్​ లో  నిర్వాసితులే స్వచ్ఛందంగా 150 ఇండ్లను తొలగించుకున్నారు.

డబుల్​ ఇండ్లకు 230 కుటుంబాలు..  

గ్రేటర్ లో మూసీ రివర్​ బెడ్​పరిధిలోకి వచ్చే ఇండ్లకు రెవెన్యూ అధికారులు ఆర్​బీ – ఎక్స్ మార్క్ వేశారు. హైదరాబాద్​ జిల్లాలో మొత్తం 1,595 నిర్మాణాలను గుర్తించగా.. 1,332 నిర్మాణాలకు మార్కింగ్​ చేశారు. గత నాలుగైదు రోజులుగా 174 కుటుంబాలు సమీప డబుల్​ ఇండ్లకు తరలివెళ్లాయి. మలక్ పేట్, చాదర్​ ఘాట్​ పరిధిలో మంగళవారం డబుల్ ఇండ్లకు వెళ్లిన నిర్వాసితులే స్వచ్ఛందంగా 151 ఇండ్లను కూలగొట్టుకున్నారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 108 నిర్మాణాలకు మార్కింగ్ చేయగా.. 33 కుటుంబాలను డబుల్ ఇండ్లకు తరలించారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్​ మండల ప్రాంతంలో మొత్తం 173 నిర్మాణాలకు మార్కింగ్ చేయగా.. 23 కుటుంబాలను డబుల్ ఇండ్లకు తరలించారు. మూడు జిల్లాల్లో కలిపి డబుల్​ ఇండ్లకు తరలిన మొత్తం 230 కుటుంబాల యజమానులకు అధికారులు త్వరలో రూ.25 వేలు అందించనున్నారు. ఇకపై స్వచ్ఛందంగా డబుల్ ఇండ్లకు తరలే మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితులకు కూడా డబ్బులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.

మూడు జిల్లాల్లో గ్రీవెన్స్​ సెల్స్

డబుల్ ఇండ్లలోకి వెళ్లిన నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. డబుల్​ఇండ్లలోకి వెళ్లాక ఏవైనా సమస్యలు ఎదురైతే.. ఫిర్యాదు చేయాలని మూడు జిల్లాల్లో  గ్రీవెన్స్​సెల్స్​ ఏర్పాటు చేసింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లలో గ్రీవెన్స్​సెల్స్ ఏర్పాటు చేయగా, రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ లోని ఆర్డీవో ఆఫీస్​ లో ఏర్పాటు చేసింది. డబుల్ ఇండ్లలోకి వెళ్లిన నిర్వాసితులు ఇండ్లలోకి నీళ్లు రాకపోవడం, లిఫ్టులు పనిచేయకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, పిల్లలను స్కూళ్లు, కాలేజీల్లో జాయిన్ చేయడం తదితర సమస్యలపై గ్రీవెన్స్​ సెల్ లో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించనున్నారు.