తెలంగాణలో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు

తెలంగాణలో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు
  • ఐదుగురితో ఏర్పాటుచేసిన సర్కార్  ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెంపునకు కృషి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్​ను ఏర్పాటు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమగ్ర విద్యా విధానం రూపకల్పన కోసం ఈ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కమిషన్ ఏర్పాటుతో పాటు గైడ్​లైన్స్​కు సంబంధించిన జీవో 27ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. కమిషన్​లో చైర్మన్​తో పాటు ముగ్గురు సభ్యులు,

మెంబర్ సెక్రటరీగా ఓ ఐఏఎస్ అధికారి ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ఆ ఐఏఎస్ అధికారే  కమిషన్ కార్యకలాపాలను సమన్వయం చేస్తారని, ఆయన్ను సర్కారు నియమిస్తుందని తెలిపారు. కమిషన్ పాలసీల రూపకల్పనకు అవసరమైన నిపుణులు, కన్సల్టెంట్లను నియమించుకునేందుకు సర్కార్​ అవకాశం కల్పించింది. కమిషన్​లో ఓడీ, డిప్యుటేషన్ పై విద్యాశాఖ ఎంప్లాయీస్​ను తీసుకునే వెసులుబాటు ఇచ్చింది.

ఈ కమిషన్​లో నాన్ ఆఫీషియల్ సభ్యుల పదవీకాలం రెండేండ్లు ఉంటుంది. కాగా, చైర్మన్​తో పాటు మెంబర్లు ఇతర అధికారుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నది. రాష్ట్రంలో విద్యారంగంలో క్వాలిటీ పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో నేషనల్ ఆచీవ్ మెంట్ సర్వే (నాస్) ప్రకారం బడుల్లో క్వాలిటీ తగ్గిందని, వర్సిటీల్లో పబ్లికేషన్స్ తగ్గిపోతున్నాయని, రీసెర్చ్ అవుట్ పుట్ సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతమున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్లకు సిల్స్ అందడం లేదన్నారు. ఈ క్రమంలో క్వాలిటీ ఎడ్యుకేషన్​కు రూట్ మ్యాప్ రెడీ చేయడం సర్కారుకు ప్రయారిటీ అని పేర్కొంది. టీచింగ్, మూల్యాంకన పద్ధతుల్లో మార్పులపై దృష్టి పెట్టనున్నది.