ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ బలోపేతానికి ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అందుకు జీవో నెం.142 ఆగస్టు 22, 2023న తీసుకొచ్చింది. దీనికి అనుబంధ పత్రాలను కూడా ఇచ్చినా అవి అధికారికంగా బయటకు రాలేదు. కానీ, తెలిసిన సమాచారం మేరకు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులను నమర్థవంతంగా ఉపయోగించుకొనుటకు రేషనలైజేషన్ చేయాలి. హైదరాబాద్ జిల్లాలో నూతనంగా 5 జోన్ల పరిధిలో అదనంగా జిల్లా వైద్యఆరోగ్య కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రం మొత్తం 38 జిల్లాలలో వైద్యఆరోగ్య కార్యాలయాలు ఉండాలి. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో 40 పీహెచ్‌సీలకు పోస్టులను సర్కారు ఏర్పాటు చేసింది.
ALSO READ : పాలేరు బరిలో నిలిచేదెవరు?..కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో తొలగని కన్ఫ్యూజన్
వైద్యవిధాన పరిషత్ పరిధిలోనికి మారిన పీహెచ్‌సీల స్థానంలో నూతనంగా 30 పీహెచ్‌సీల ఏర్పాటు, భవిష్యత్తులో పనికిరానివిగా భావించిన 123 సంస్థల్లో 2,606 ఉద్యోగులను రద్దుచేయుటం. 1,712 పోస్టులను సూపర్ న్యూమరీగా మార్చడం.. మొత్తం 4,318 పోస్టులను తగ్గించడం లాంటి కార్యక్రమాలను వచ్చే మూడు మాసాల్లో పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది.
కొత్త పోస్టులను శాంక్షన్ చేయాలి
రేషనలైజేషన్ చేసి ఉద్యోగులను ప్రజలకు మేలైన ఆరోగ్య సేవలు అందించటాన్ని అందరం స్వాగతించాలి. కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలను కొత్త జోన్లను ఏర్పాటు చేశారు. అయితే, కొత్త పోస్టులను శాంక్షన్ చేయకుండానే వున్న ఉద్యోగులను పంపిణీ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్న ఉద్దేశ్యమే ఎవరి స్థానిక ప్రాంతంలో వారు ఉండటంతోపాటు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అయితే, కొన్ని జోన్లలో ఉద్యోగులకు ఆ అవకాశమే లేదు.
జీవో నెం.317 పేరుతో ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లుగా విభజించి, సెల్ ఫోన్‌లకు మేసేజ్‌లు పంపి ఉద్యోగులను గందరగోళానికి గురిచేసి సుదూర ప్రాంతాలకు ప్రభుత్వం పంపించింది. స్థానికంగా ఉండవలసిన ఉద్యోగులు నాన్ లోకల్ ప్రాంతాల్లో పనిచేస్తూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. జీవో నెం.42 ప్రకారం ఉద్యోగులకు, ప్రజలకు నష్టం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా పెద్ద సంఖ్యలో కంటి పరీక్షలు నిర్వహించింది. లక్షల సంఖ్యలో కంటి అద్దాలను పంపిణీ చేసి వేల సంఖ్యలో ఆపరేషన్లను చేయించారు. ప్రభుత్వాన్ని అందుకు అభినందించాలి.
కానీ ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియ. అందుకు భిన్నంగా 145 పారా మెడికల్ ఆప్తాల్మిక్ అధికారులను, 15 స్పెషలిస్ట్ ఆప్తాల్మిక్ డాక్టర్ల పోస్టులను సూపర్ న్యూమరీగా మార్చారు.ఈ జీవో ప్రకారం కొత్తగా పురుష ఆరోగ్య కార్యకర్తలను శాంక్షన్ చేయకపోగా ఉన్న 447 పోస్టులను కూడా రద్దుచేయడం చాలా దురదృష్టకరం. ఈ రకంగా 123 సంస్థలలో అధికారుల నుంచి మొదలుకొని అటెండర్ పోస్టుల వరకు 2,606 పోస్టులను రద్దుచేయడం. 1,712 పోస్టులను భవిష్యత్తులో ఉపయోగపడవని గుర్తించడం చాలా దారుణం.
3,754 ఆరోగ్య ఉప కేంద్రాల కొరత
ఒక క్రమపద్ధతిలో ఉద్యోగులను అన్ని జిల్లాలకు, ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయాలి అని జీవోలో పొందుపరిచారు. అనుబంధ పత్రాలలో మాత్రం 636 పీహెచ్‌సిల్లో ఉద్యోగులను పంపిణీ చేసిన విధానం కొన్ని జిల్లాలకు కొన్ని క్యాడర్ ఉద్యోగులను ఎక్కువగా కేటాయించడం, మరికొన్నిటికి చాలా తక్కువగా కేటాయించారు. 5 వేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ 5 వేలు కాస్తా 10 వేల నుంచి అర్బన్ ఏరియాలో లక్ష జనాభాకుపైగా కొన్ని ఉపకేంద్రాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 3 వేల జనాభాకు ఒక ఉపకేంద్రం ఉండాలి.
అర్బన్ ఏరియాలో 10 వేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉండాలి. సగటును 5 వేల జనాభాకు ఒక ఉప కేంద్రం ఉండాలన్నా తెలంగాణా 4 కోట్ల జనాభాకు 8 వేల ఉపకేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం4,246 మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రూరల్ ఏరియాలో 30 వేల జనాభా, అర్బన్ ఏరియాలో 50 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉండాలి. అలాగే 40 వేల జనాభాకు ఒకటి చొప్పున 4 కోట్ల జనాభాకు 1000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం కొత్త వాటితో కలిపి 706 మాత్రమే ఉన్నాయి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఇంకా 3,754 ఆరోగ్య ఉప కేంద్రాలు, 294 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందడానికి 15 నుంచి 20 సంవత్సరాల పైబడి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎఎన్‌ఎంలను అందరినీ రెగ్యులర్ చేయాలి. వైద్యఆరోగ్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల అందరినీ రెగ్యులర్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించలేదు.
రద్దు కాబోతున్న 2,606 పోస్టుల్లో 1685 పోస్టులు కిందిస్థాయి పోస్టులు ఉన్నాయి. అవసరంలేనివిగా గుర్తించిన వాటిలో 1,778 క్రింది స్థాయి పోస్టులున్నాయి. ఈ పోస్టులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నియమించాలి. ప్రభుత్వము బేషజాలకు పోకుండా జీవో 142 ని వెంటనే రద్దు చేయాలి.
- కడారి బలరామ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్