- ఇతర శాఖలు, కార్పొరేషన్ల సిబ్బందినీ వినియోగించుకోనున్న సర్కార్
- ఇంజనీర్ల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు
- ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనూ కొందరిని తీసుకునే చాన్స్
- లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీం అమలు, పర్యవేక్షణకు ప్రతి మండలానికో ఇంజనీర్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో 539 మండలాలు ఉండగా ఏఈఈ స్థాయి అధికారి ఉంటే స్కీం పారదర్శకంగా, వేగంగా అమలవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు కోసం ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తమకు సరిపడా ఇంజనీర్లు లేరని, మరింత మందిని కేటాయించాలని ఇటీవల రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డిని కార్పొరేషన్ అధికారులు కోరారు. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు జీహెచ్ఎంసీ, జలమండలితోపాటు ఇతర శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని రిలీవ్ చేయాలని కోరారు. దీంతో వారిని వెంటనే రిలీవ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఇతర శాఖల్లో పని చేస్తున్న 242 మందిని రిలీవ్ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
త్వరలోనే వీరంతా హౌసింగ్ కార్పోరేషన్ కు రానున్నారు. అలాగే, ఇతర శాఖలు, కార్పొరేషన్లకు చెందిన ఇంజనీర్లను కూడా హౌసింగ్ కార్పొరేషన్ కు డిప్యూటేషన్ మీద తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. అయితే, కీలక శాఖలైన ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, మిషన్ భగీరథ కాకుండా ఇతర కార్పొరేషన్లలో ఉన్న ఇంజనీర్ల వివరాలను మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మిగతా శాఖలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఇంజనీర్ల వివరాలను అందచేయాలని ఇటీవల సీఎస్ శాంతికుమారి ఆయా శాఖలకు లేఖ రాశారు. వీరి వివరాలు వచ్చాక త్వరలోనే హౌసింగ్ కార్పొరేషన్ కు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. సోషల్ వెల్ఫేర్, రాజీవ్ విద్యా మిషన్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, మార్కెటింగ్, ఎండో మెంట్, మెడికల్ ఇన్ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆర్టీసీ, పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్లలో ఇంజనీర్లు ఉన్నట్లు అధికారులు సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చారు.
ఇండ్లు స్టార్ట్ చేస్తే సిబ్బంది కొరత
ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు ప్రజా పాలనలో సుమారు 65 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని త్వరగా గ్రామాల్లో, సిటీల్లో ఏర్పాటు అయిన ఇందిరమ్మ కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి గ్రామ సభ, వార్డు సభల్లో ప్రకటించనున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇడ్ల చొప్పున ఫస్టు ఫేజ్ లో 4.5 లక్షల ఇండ్లకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పథకం అమలుకు తగినంత సంఖ్యలో పర్మినెంట్ స్టాఫ్ లేరు. దీంతో ఒకేసారి స్కీం అమలును ప్రారంభిస్తే సిబ్బంది కొరత వేధిస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకే తాత్కాలికంగా ఇంజినీర్లను హౌసింగ్ కార్పొరేషన్ కు డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకోనున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.