- న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లా మల్టీపర్పస్ హబ్ నిర్మాణం
- రాయదుర్గంలో డెవలప్చేయాలని సర్కారు నిర్ణయం
- టెండర్లను పిలిచిన టీజీఐఐసీ
- ఎంటర్టెయిన్ మెంట్, టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి
హైదరాబాద్, వెలుగు : అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో టీ స్క్వేర్ ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ డెస్టినేషన్ హైదరాబాద్ లోని రాయదుర్గంలో ‘టీ స్క్వేర్’ పేరిట ఓ భారీ టవర్‌ను నిర్మించనుంది. దీని నిర్మాణానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 9 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లను పంపించాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో టీజీఐఐసీ పేర్కొంది. నిర్మాణ నాణ్యత, నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చు ఆధారంగా బిల్డర్ ను ఎంపిక చేస్తామని అందులో వెల్లడించింది.
ఇక ఐటీ హబ్ గా ఉన్న రాయదుర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అయినా.. పబ్లిక్ సేద తీరేందుకు సరైన సౌలతులు లేవని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఐటీ నిపుణులతో పాటు మిడిల్ క్లాస్ ప్రజలూ అక్కడకు వచ్చి పనిభారం నుంచి సేదతీరేలా టీ స్క్వేర్ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వ్యక్తులు, సంస్థల మధ్య కమ్యూనికేషన్‌కు వారధిగా
రోజంతా పని ఒత్తిడిలో ఉన్న జనానికి ఊరటనిచ్చే రీక్రియేషన్ హబ్‌గా, వేడుకలు చేసుకునే వేదికగా, వ్యాపార కేంద్రంగా టీ స్క్వేర్ను తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పర్యావరణాన్ని కాపాడేలా ఆ నిర్మాణం చుట్టూ పచ్చని చెట్లతోనూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించనున్నారు.
టూరిస్టులను పెంచుకునేందుకు వీలు
టీ స్క్వేర్ ద్వారా హైదరాబాద్ సిటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. అందులో భాగంగానే టీ స్క్వేర్ను మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ఆలోచిస్తున్నది. అందుకు అనుగుణంగా బిడ్ వేసే నిర్మాణ సంస్థలు సైట్లో కాన్సెప్ట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో టీజీఐఐసీ పేర్కొంది.
వాటిలో నుంచి ఉత్తమ నిర్మాణ డిజైన్, బెస్ట్ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. టీ స్క్వేర్ వల్ల ప్రజలకు ఉల్లాసం దక్కడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ సమకూరుతుంది. ఆ స్క్వేర్‌లో ఏర్పాటు చేసే వీడియో బిల్‌బోర్డులపై ప్రకటనలు, వచ్చి పోయే పర్యాటకులతో ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.