- నాలుగు నెలలు గడుస్తున్నా దృష్టి పెట్టని అధికారులు
- చాలా స్కూళ్లు, కాలేజీల్లో ప్రహరీ క్లబ్బుల్లేవ్
- హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,262 హైస్కూళ్లు,386 జూనియర్ కాలేజీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : కేవలం ప్రభుత్వ స్కూల్స్మాత్రమే కాదు. సిటీలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. గంజాయి చాక్లెట్లు, ఈ సిగరెట్లు, వైట్నర్లు, మెడికల్ షాపుల్లో లభించే ఇతర మత్తును ఇచ్చే టాబ్లెట్లు, సిరప్స్ వంటి వాటికి స్టూడెంట్స్అలవాటు పడుతున్నారు. స్కూల్ దశలోనే పిల్లలు ఇలా పెడదారి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం స్కూళ్లు, కాలేజీల్లో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జూలై నెలలో సర్క్యూలర్ కూడా విడుదల చేసింది.
4 నెలలు గడుస్తున్నా కొన్ని చోట్లనే
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,262 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కార్పొరేట్ హైస్కూల్స్ ఉండగా, అందులో దాదాపు 5 లక్షల మంది స్టూడెంట్స్చదువుకుంటున్నారు. ఇందులో 183 ప్రభుత్వ హై స్కూల్స్ ఉన్నాయి. అయితే, ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించి నాలుగు నెలలు గడుస్తున్నా.. జిల్లాలో ఇంతవరకు మెజారిటీ ప్రభుత్వ స్కూళ్లలో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేయలేదు. ప్రైవేట్ స్కూళ్లలో వీటిని పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలూ వస్తున్నాయి.
ఎన్ని స్కూళ్లు, కాలేజీల్లో క్లబ్బులు ఏర్పాటు చేశారో కూడా అధికారుల వద్ద సమాచారం లేదు. డ్రగ్స్, గంజాయి ఎంత తీవ్రమైన సమస్యలో తెలిసినప్పటికీ... అధికారులు పెడచెవిన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 22 ప్రభుత్వ, 14 ఎయిడెడ్, 350 ప్రైవేట్జూనియర్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి.
అసలేంటీ ప్రహరీ క్లబ్బులు?
స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ప్రహరీ క్లబ్బులు నిఘా పెడతాయి. క్లబుల్లో స్కూల్ హెచ్ఎం, కాలేజీ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్‌గా, సీనియర్ టీచర్, లెక్చరర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారు. మెంబర్లుగా ఆరు నుంచి పదో తరగతి మధ్య చదువుతున్న చురుకైన ఇద్దరు స్టూడెంట్స్, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్, టీచర్, పేరెంట్ అసోషియేషన్ నుంచి ఒకరు ఉంటారు.
వీరు ఎన్జీవోల సహకారంతో ప్రతినెలా స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన సమావేశాలు నిర్వహించాలి. స్కూల్, కాలేజీ పరిసరాల్లో మత్తు పదార్థాల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల ప్రాంగణాల్లో ‘నోడ్రగ్స్’ బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఖైరతాబాద్‌లోని ఓ గవర్నమెంట్ హైస్కూల్లో కొందరు స్టూడెంట్స్ గంజాయి చాక్లెట్లు తీసుకుంటూ టీచర్లకు దొరికారని తెలుస్తోంది. ఆ పిల్లల పేరెంట్స్‌ను టీచర్లు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు.
నాంపల్లి మండలంలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో నలుగురు పిల్లల ప్రవర్తనపై టీచర్లకు అనుమానం వచ్చింది. వారిని కొన్ని రోజులు గమనించిన టీచర్లు ఒక రోజు వారి బ్యాగులను చెక్ చేశారు. వారి బ్యాగుల్లో నిషేధిత ఈ సిగరెట్లు దొరికాయి. ఆ పిల్లల పేరెంట్స్‌ను స్కూల్ హెచ్ఎం పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.