- దక్షిణాదిలో కలిసొచ్చే రాష్ట్రాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసే యోచనలో సీఎం
హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాన్ స్టిట్యూషనల్ బెంచ్‌కు వెళ్లడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్నది. స్థానికంగా ఉండే విద్యార్థులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర నష్టం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు, కేంద్రానికి పీజీ మెడికల్ సీట్ల కోటా రద్దు పై లెటర్ రాయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏపీ, కర్నాటక రాష్ట్రాల సీఎంలతోనూ ఈ అంశం ప్రస్తావించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే.. పీజీలో స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులవుతారని రాష్ట్ర ప్రభుత్వం జీవో 148, 149 తీసుకువచ్చింది. ఇతరులు రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదని అందులో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు స్థానిక కోటా కింద పీజీ ప్రవేశాల్లో ఎక్కువ మందికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీట్లన్నీ నేషనల్ పూల్‌లోకి వెళ్లనున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లూ దెబ్బతినే ప్రమాదం
తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/ బీఏఎంఎస్ చేసిన వారికి పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తెలంగాణలో స్థానికులై ఉండి.. రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చదివిన, ఇన్ సర్వీసు (తెలంగాణలో సివిల్ సర్జన్లుగా చేస్తున్న) అభ్యర్థులకు సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని పేర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పీజీ స్టూడెంట్ యావరేజ్‌గా 13 వేల మందికి సేవలు అందిస్తుంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో అంతకు మూడింతల మందికి ఒక పీజీ స్టూడెంట్ ఉన్నారు.
రాష్ట్రంలో కాలేజీలు భారీగా ఏర్పాటు చేశారు. 2014 వరకు 5గా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పుడు 34కు చేరింది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025 నాటికి తెలంగాణలో 2,924 పీజీ సీట్లు అందుబాటులో ఉంటే అందులో 50 శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1,462 పీజీ సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే వచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ 1462 సీట్లు కూడా ఆలిండియా కోటాలోకి వెళ్లిపోనున్నాయి. ఈ నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పీజీలో ఇన్ సర్వీస్ కోటా ప్రశ్నార్థకమై.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే అవకాశం కూడా ఉండదంటున్నారు.