- ఇందిర మహిళా శక్తి కింద నియోజకవర్గానికో రూ.కోటి
- వచ్చే 5 నెలల్లో రూ.1,372 కోట్ల పనులకు సీతక్క ఆమోదం
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పొలాలకు బాటలు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు చెందిన 2,700 ఎకరాల్లో రూ.16.20 కోట్లతో ఈజీఎస్ ద్వారా పండ్ల తోటలు, ఈతమొక్కల పెంపకం చేపట్టనుంది. శుక్రవారం సెక్రటేరియెట్లోని తన చాంబర్లో మంత్రి సీతక్క.. ఈజీఎస్పై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఐదు నెలల కాలానికి సంబంధించి రూ.1,372 కోట్లతో చేపట్టబోయే ఉపాధిహామీ పనుల ప్రణాళికలకు మంత్రి ఆమోదం తెలిపారు.
వచ్చే ఏడాది వన మహోత్సవంలో భాగంగా 9 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. జలనిధి కింద వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్రంలో రూ.204 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.2 కోట్ల నిధులతో మొత్తం 11,350 నీటి నిల్వ, నీటి సంరక్షణ పనులను చేపట్టడానికి ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో భాగంగా 540 చెక్ డ్యాములు, 540 వ్యయసాయ బావుల నిర్మాణం, వెయ్యికిపైగా బోరుబావుల రీచార్జీ గుంతల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.5 కోట్లతో గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతోపాటు 2025-–26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,960 కోట్లతో చేపట్టే పనుల కోసం అధికారులు అంచనాలు రూపొందించగా.. మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.