మూడు గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు

మూడు గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు
  • కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్ 
  • గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ 
  • 17న అసెంబ్లీ ముందుకు బిల్లు 

హైదరాబాద్, వెలుగు: జస్టిస్ షమీమ్ అక్తర్​ ఏక సభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూప్​లతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సులతోపాటు ఎంపిరికల్(అనుభావిక) డేటాను పరిగణనలోకి తీసుకుని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది. దాన్ని 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది.  ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా చేసే అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అదేసమయంలో 2 గ్రూపులుగా వర్గీకరించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అభివృద్ధి చెందిన.. అభివృద్ధి చెందని కులాలను రెండు గ్రూపులుగా విభజించడంపై స్టడీ చేశారు. అయితే, అలా చేయడం వల్ల అసమానతలను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు. దీంతో కమిషన్ సిఫార్సుల ప్రకారం 3 గ్రూప్​లకే మొగ్గు చూపిన సర్కారు.. న్యాయ సలహా సైతం తీసుకుని బిల్లును రెడీ చేసింది. 

కమిషన్ పేర్కొన్నట్లే బిల్లులో రిజర్వేషన్లను ప్రతిపాదించింది. మొత్తంగా ఎస్సీల రిజర్వే షన్ 15 శాతం ఉంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా, షమీమ్ అక్తర్ కమిషన్ పేర్కొన్న ప్రకారం.. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీల్లో వీరి జనాభా 3.288 శాతంగా ఉండగా, వీరికి 1% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. వీరి జనాభా 62.748 శాతం కాగా, వీరికి 9 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో ఉంచారు. మొత్తం ఎస్సీల్లో వీరి జనాభా33.963 శాతంగా ఉండగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు.  

అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటాలిలా.. 

ఎస్సీ వర్గీకరణపై స్టడీకి ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ తన రిపోర్ట్​లో కీలక విషయాలను పేర్కొంది. ఎస్సీల్లో వెనకబాటుతనం, లిటరసీ, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కులాలకు సంబంధించి ఎంపిరకల్(అనుభావిక) డేటాను విశ్లేషించి పూర్తి నివేదికను ఇచ్చింది. దీని ప్రకారం గ్రూప్ 1లో 15 కులాలు ఉండగా.. వీటిలో అక్షరాస్యత శాతం 50లోపు ఉన్న కులాలు 8 శాతంలోపు ఉన్నాయి. లిటరసీ 50 నుంచి 60 శాతం మధ్య ఉన్న కులాలు 4 ఉండగా.. 60 శాతంపైగా లిటరసీ 3 కులాల్లోనే ఉన్నదని పేర్కొన్నారు. ఇదే గ్రూప్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా వాటా కన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు 3 ఉన్నాయి. జనాభా వాటా కన్నా తక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు 12 ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో 18 కులాలు ఉంటే.. 50-60 శాతం మధ్య లిటరసీ ఉన్న కులాలు 9 కాగా.. 60 శాతం, ఆపైన మరో 9 కులాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేసరికి జనాభా వాటా కన్నా ఎక్కువ ఉద్యోగాలు 12 కులాలకు వచ్చాయి. వాటా కన్నా తక్కువ ఉద్యోగాలు 6 కులాలు పొందాయని పేర్కొన్నారు. అలాగే, గ్రూప్ 3లో 26 కులాలు ఉండగా.. 50-60 శాతం వరకు లిటరసీ ఉన్న కులాలు 7 కాగా, 60 శాతంపైన ఉన్న కులాలు19 ఉన్నట్లు తేల్చారు. ఈ గ్రూప్​లో జనాభా వాటా కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను 22 కులాలు పొందినట్లు తేల్చారు. మరో 4 కులాలకు జనాభా కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు పేర్కొన్నారు.