స్కూల్ స్థాయి నుంచే డ్రైవింగ్ ఎడ్యుకేషన్

స్కూల్ స్థాయి నుంచే డ్రైవింగ్ ఎడ్యుకేషన్
  • పైలెట్ ప్రాజెక్టుగా 300 స్కూళ్లలో అమలుకు రవాణా శాఖ నిర్ణయం
  • రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన
  • ఓ స్వచ్ఛంద సంస్థతో అగ్రిమెంట్

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచే “కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్’’ పేరుతో కొత్త ప్రోగ్రాంను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి స్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి.. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది.

 డాక్టర్ గురువా రెడ్డి ఆధ్వర్యంలోని సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా యూనిసెఫ్ రవాణా విభాగం సహకారంతో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా 300 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. 

పర్మనెంట్ లైసెన్స్ పొందే వారికి ప్రత్యేక శిక్షణ

లెర్నింగ్ లైసెన్స్ నుంచి పర్మనెంట్ లైసెన్స్ పొందే వారికి కూడా 3 గంటల వీడియో ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పించాలని రవాణా శాఖ నిర్ణయించింది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను భారీగా తగ్గించవచ్చని అధికారులు అంటున్నారు. 

3గంటల వీడియోలో ప్రమాదాలు ఎక్కువగా ఎలా జరుగుతున్నాయి? ప్రమాదాల్లో కుటుంబ పెద్ద చనిపోయిన మిగిలిన వారి పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందనే దృశ్యాలతో పాటు డ్రైవింగ్ విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం అనే అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. 

ఆ తర్వాత దీనిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం మొదటి దశలో 15 ఆర్టీఏ కేంద్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో ఆరు, మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 

సోమవారం సెక్రటేరియెట్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా దీనిపై చర్చించి, సాధ్యమైనంత తొందరగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.